ప్రధాని మోడీతో కొట్లాడి హైదరాబాద్ ఓల్డ్ సిటీకి మెట్రో రైలును తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆరాంఘర్-జూపార్క్ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఫ్లై ఓవర్‌కు దివంగత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టినట్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారు. మోడీతో కొట్లాడాల్సి వస్తే కొట్లాడతా.. అసదుద్దీన్‌తో కలవాల్సి వస్తే కలుస్తామని తెలిపారు. అప్పట్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో హైదరాబాద్‌లో పీవీ ఎక్స్‌ప్రెస్ అతిపెద్ద ఫ్లై ఓవర్ నిర్మించారని.. ఇప్పుడు అదే తరహాలో తెలంగాణ ఏర్పడ్డాక రెండో అతి పెద్ద ఫ్లైఓవర్ నిర్మించుకున్నట్లు వెల్లడించారు. మనకు మనమే సాటి అని చెప్పుకోవడానికి ఇదొక్కటి చాలు అనితెలిపారు.
ఇది కూడా చదవండి: Good Bad Ugly: గుడ్.బ్యాడ్.అగ్లీకి కొత్త రిలీజ్ డేట్
‘‘హైదరాబాద్ నగర అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. మెట్రో రైలు, రోడ్ల విస్తరణ, శాంతి భద్రతల పరిరక్షణ, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం ప్రాధాన్యతగా పెట్టుకున్నాం. ఫ్లై ఓవర్ ప్రారంభంతో పాటు శివరేజ్ పనులు ప్రారంభించాం. మూసీ నదిని పునరుజీవింపజేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్‌కు గోదావరి జలాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. నిజాం కాలంలో కాలంలో నిర్మించిన ఉస్మాన్, హిమాయత్ సాగర్‌లను నిర్మించి తాగునీటి సమస్యలు లేకుండా చేశారు. హైదరాబాద్ లేక్ సిటీగా ఉండేది. నిజాం చేసిన అభివృద్ధిని కాపాడుకుంటే ప్రపంచంలో హైదరాబాద్ బెస్ట్ నగరంగా ఉండేది. చిన్న వర్షం వచ్చినా ట్రాఫిక్, వరదలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. అక్బరుద్దీన్ చిన్నప్పటి స్నేహితుడు. హైదరాబాద్ డెవలప్‌మెంట్ కోసం ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు కలిసి పని చేస్తాయి. చర్లపల్లి టెర్మినల్ స్టేషన్ ప్రారంభ సమయంలో మోడీతో మాట్లాడాను. హైదరాబాద్ మెట్రో విస్తరణ కోసం సహకరించాలని కోరాం. ప్రధాని, మేము వేర్వేరు పార్టీల్లో ఉన్న కూడా నగర అభివృద్ధి కోసం, పనుల కోసం మాట్లాడాను. రీజినల్ రింగ్ రోడ్ ఏర్పడితే మరింత డెవలప్ అవుతుంది. రీజినల్ రింగ్ రోడ్‌కు కలిపి రీజినల్ రింగ్ రైల్ కూడా కావాలని ప్రధాని కోరాను.’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
‘‘మీర్ ఆలం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తాం. ఓల్డ్ సిటి అభివృద్ధికి అక్బరుద్దీన్ అడిగిన పనులన్నింటికీ డబ్బులు మంజూరు చేసే బాధ్యత నాది. ఓల్డ్ సిటీలో గల్లీ గల్లీ నాకు తెలుసు. ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేస్తాం. గత ప్రభుత్వం శంషాబాద్‌కు మెట్రో రైలును గచ్చిబౌలి నుంచి తీసుకువెళ్లాలని ప్రతిపాదించింది.. కానీ మేము ఓల్డ్ సిటీ నుంచి మెట్రో శంషాబాద్‌కు తీసుకెళ్తున్నాం.’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.