MP Eatala Rajender: మూసీ ప్రక్షాళన, మురుగునీటి శుద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించాలని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. పార్లమెంట్ లో మాట్లాడిన ఆయన.. శుభ్రమైన తాగునీటి కోసం తెలంగాణకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలో పట్టణీకరణ వేగంగా పెరిగిపోతుండటంతో.. నీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఇక, పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత మౌలిక సదుపాయాలు, సేవలను అందించడంలో ఇబ్బంది పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ సవాళ్లను గుర్తించి కేంద్రం స్మార్ట్ సిటీస్, అమృత్ పథకాల కింద నిధులు ఇవ్వడం ఎంతో ప్రశంసనీయమైందన్నారు.
Read Also: Electronics Premier League: ఐపీఎల్ 2025 కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేక డీల్స్!
అయితే, హైదరాబాద్ నగరంలోని సరస్సులు మురుగునీటితో కలుషితం కావడంతో నగరం పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. ఒకప్పుడు ఈ నగరాన్ని సరస్సుల నగరంగా పిలిచేవారు. హుస్సేన్ సాగర్‌తో సహా దాని నీటి వనరులు అన్ని మురుగునీటి ప్రవాహాల కారణంగా పూర్తిగా కలుషితమయ్యాయి.. దీంతో జీవవైవిద్యం పూర్తిగా దెబ్బ తినే పరిస్థితి ఏర్పడింది.. కలుషితమైన నీరు బయటకు రావడంతో పాటు భూగర్భ జలాలు కూడా కాలుష్యమైపోతున్నాయి.. ఇలాంటి నీటి ద్వారా వ్యాధులు వ్యా్ప్తి చెందే పరిస్థితులు నెలకున్నాయని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. అయితే, మురుగునీటిని మళ్లించటంతో పాటు మురుగునీటి శుద్ధి కేంద్రాలను మరింత బలోపేతం చేసేలా మరన్నీ నిధులు ఇవ్వాలన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ కు మూసీ జీవనదిగా ఉండేది.. కానీ, ఇప్పుడు విషపూరిత వ్యర్థాలు, శుద్ధి చేయని మురుగునీటి ప్రవాహాలతో తీవ్రమైన పర్యావరణ, ఆరోగ్యకరమైన ఇబ్బందులను సృష్టిస్తుందన్నారు. వీటికి, జలశక్తి మంత్రిత్వ శాఖ తగినంత నిధులను కేటాయించి.. మూసీ నది వెంబడి ఉన్న STPలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఎంపీ ఈటల రాజేందర్ కోరారు.