Jubilee Hills By poll: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిపోతున్నాయి.. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. నవంబర్ 11వ తేదీన ఉప ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 14వ తేదీన కౌంటింగ్ నిర్వహించి ఫలితాన్ని ప్రకటించనున్నారు.. అయితే, ఈ నెల 13న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. ఈ నెల 13 నుంచి 21వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.. 22న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 24వ తేదీ వరకు అవకాశం కల్పించారు. అయితే, అన్ని పార్టీలు జూబ్లీహిల్స్‌పై ఫోకస్ పెట్టాయి.. ఇప్పటికే బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత గోపీనాథ్ పేరును ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..
ఇక, ఇవాళో.. రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనేది తేలిపోనుంది.. ఇంకో వైపు.. బీజేపీ కూడా తమ అభ్యర్థిని పెట్టేందుకు సమావేశాలు నిర్వహిస్తోంది.. ఇప్పుడు అనూహ్యంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెరపైకి వచ్చింది.. ఇవాళ తెలంగాణకు చెందిన టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఈ సమావేశంలో ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే చర్చ సాగనుంది.. దీంతో, టీడీపీ తమ అభ్యర్థిని బరిలోకి దింపనుందా? లేదు ఏ పార్టీకైనా మద్దతు పలుకుతుందా? అనేది చర్చగా మారింది.. అయితే, జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే గోపీనాథ్ మృతిచెందిన నేపథ్యంలో ఈ ఉపఎన్నిక జరుగుతోన్న విషయం విదితమే కాగా.. మాగంటి గోపీనాథ్ టీడీపీలో గెలిచి బీఆర్ఎస్‌లోకి వెళ్లిన వ్యక్తే కావడం.. మరోసారి అదే ఫ్యామిలీకి టికెట్ ఇవ్వడంతో.. బీఆర్ఎస్ అభ్యర్థికే చంద్రబాబు మద్దతు ప్రకటిస్తారా? అనేచర్చ సాగుతోంది.. మరోవైపు, బీజేపీ కూడా అభ్యర్థిపై కసరత్తు చేస్తోన్న నేపథ్యంలో.. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న చంద్రబాబు.. ఇక్కడ బీజేపీ వైపు మొగ్గు చూపుతారా? అనే మరో చర్చ కూడా సాగుతుంది.. మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ స్టాండ్ పై ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..