హైదరాబాద్ నగర ప్రయాణికులకు మెట్రోరైలు అధికారులు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ మేరకు సూపర్ సేవర్ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్డుతో రోజంతా మెట్రోరైలులో ప్రయాణం చేయవచ్చని తెలిపారు. ఈ కార్డు ధర రూ.59గా మెట్రో అధికారులు వెల్లడించారు. ఉగాది రోజు నుంచి సూపర్ సేవర్ కార్డులను విక్రయిస్తామని మెట్రోరైలు ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. ఈ కార్డుతో నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజంతా తిరగవచ్చన్నారు. కరోనా తర్వాత మళ్లీ మెట్రో సేవలను ప్రయాణికులకు మరింత చేరువ చేయడానికి అధికారులు ఈ ఆఫర్ ప్రవేశపెట్టారు.
అయితే ఈ కార్డు వినియోగంపై ఓ షరతును కూడా మెట్రోరైలు అధికారులు విధించారు. కేవలం హైదరాబాద్ మెట్రోరైలు అధికారులు ప్రకటించిన 100 సెలవు రోజుల్లో మాత్రమే ఈ కార్డు వర్తిస్తుంది. ఈ మేరకు సెలవు రోజులను అధికారులను ప్రకటించారు. ప్రతి ఆదివారం, ప్రతి రెండో, నాలుగో శనివారం, ఉగాది, రంజాన్, మొహరం, బోనాలు, ఆగస్టు 15, వినాయక చవితి, కృష్ణాష్టమి, దుర్గాష్టమి, దసరా, దీపావళి, బాక్సింగ్ డే, బోగీ, సంక్రాంతి, శివరాత్రి ఈ సెలవుల జాబితాలో ఉన్నాయి. ఆయా సెలవు రోజుల్లో రూ.59తో రోజంతా మెట్రో రైలులో ప్రయాణించవచ్చు.