హుజురాబాద్ ఉపఎన్నిక మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెలలోనే ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడుతుందని రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇప్పటి వరకు భావించాయి. అయితే కరోనా పరిస్థితుల్లో ఎన్నికను నిర్వహించడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా? నిర్వహిస్తే ఎలాంటి నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుందో చెప్పాలంటా రాజకీయ పార్టీలను సూచనలు, సలహాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. ఇందుకు ఈ నెల 30వ వరకు గడవు విధించింది. దీంతో ఎన్నికల షెడ్యూల్ ఇప్పట్లో వెలువడే అవకాశం ఎంతమాత్రం కనిపించడం లేదు. తెలంగాణలో హుజురాబాద్‌తో పాటు ఎపిలో బద్వేల్ నియోజకవర్గానికి కూడా ఉపఎన్నిక జరగాల్సి ఉంది. అలాగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలను జరపాల్సి ఉంది.
అయితే దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఆయా రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో కేంద్ర ఎలక్షన్ కమిషనర్లు ఇప్పటికే సమావేశమై సమీక్ష నిర్వహించారు. వివిధ స్థాయి అధికారులతో ప్రభుత్వ సన్నద్ధతపై ఆరా తీశారు. ఇప్పుడు పార్టీల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ, ఎపి రాష్ట్రాల ఎన్నికల అధికారులతో పాటు రాజకీయ పార్టీల అభిప్రాయలను సేకరించిన మీదట ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇదిలావుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎంఎల్‌ఎ కోటాలోని ఆరు ఎంఎల్‌సి స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి అనువైన వాతావరణం లేదంటూ కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అక్టోబరు వరకు సాధారణ పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చని ఆ లేఖలో స్పష్టం చేసినట్లు సమాచారం. హుజూరాబాద్ ఉపఎన్నికల నిర్వహణ కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కోవిడ్ ప్రభావం లేనిపక్షంలోనే ఎలక్షన్ నిర్వహించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో షెడ్యూల్ ఎప్పుడు వెలువడుతుందన్న అంశంపై ప్రస్తుతం సస్పెన్స్ నెలకొంది. అయితే.. హుజురాబాద్ ఉప ఎన్నికల ఆలస్యం అయితే.. ఈటలకు షాక్ తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.