ఉన్నతాధికారులపై కోర్టు ధిక్కరణ ఉత్తర్వులను తెలంగాణ హై కోర్టు కొట్టేసింది. ఓ కేసుకు సంబంధించి అటవీ శాఖ ఉన్నతాధికారులతో పాటు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు విధించిన శిక్ష కేసుకు సంబంధించి అప్పీల్ కు అనుమతి ఇస్తూ, కోర్టు ధిక్కరణ ఉత్తర్వులను హై కోర్టు కొట్టి వేసింది. సింగిల్ జడ్డి ఇచ్చిన ఉత్తర్వులపై అధికారులు అప్పీల్ చేసుకునేందుకు చీఫ్ జస్టిస్ తో కూడిన ద్వి సభ్య బెంచ్ అనుమతించింది. 2009 కి చెందిన ఓ కేసులో కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదంటూ ఈ నెల మొదటి వారంలో సింగిల్ బెంచ్ జడ్డి ఆరు నెలల జైలు, రెండు వేల రూపాయల జరిమానా విధించింది.
అటవీ శాఖ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతికుమారి, రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్, పీసీసీఎఫ్ ఆర్. శోభ, రంగారెడ్డి సీసీఎఫ్ సునీతా భగవత్, తదితరులు గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకుండా కోర్టు దిక్కరణకు పాల్పడ్డారనేది అభియోగం. ఈ కేసుకు సంబంధించి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు కోర్టుకు హాజరవటంతో పాటు, ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. అలాగే అప్పీలుదారు కోర్టు ధిక్కరణ కోసం పిటిషన్ వేసే గడువు కూడా ముగిసిపోయింది. అందువల్ల ఇది కోర్టు ధిక్కరణ పరిధిలోకి రాదని, తమను శిక్షనుంచి మినహాయించి, అప్పీలుకు అవకాశం ఇవ్వాలనే ఉన్నతాధికారుల పిటీషన్ ను హైకోర్టు అనుమతించింది.