తెలంగాణ, మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు వరద పోటెత్తుతుంది.బరాజ్ లోని 85 గేట్లకు గాను 81 గేట్లు ఎత్తి 6,80,130 క్యూసెక్కుల నీటిని దిగువకు తరలిస్తున్నారు ఇంజనీరింగ్ అధికారులు. మరోవైపు అన్నారం సరస్వతీ బ్యారేజీకి ఎగువ పార్వతి బ్యారేజీ నుంచి, మానేరు నదులు, స్థానిక వాగులు, వంకల ద్వారా భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది.
బ్యారేజీలో 66 గేట్లుండగా 60 గేట్లు ఎత్తి దిగువకు తరలిస్తున్నారు. ఇన్ ఫ్లో 1,88,500 క్యూసేక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో కూడా సమానంగా ఉంది. దీంతో కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువన గోదవారి,ప్రాణహితలోకి భారీగా వరద నీరు చేరి కాళేశ్వరం తీరం వద్ద 10.26 మీటర్ల ఎత్తులో పుష్కర ఘాట్ మెట్లపై నుండి ఉభయ నదుల ప్రవాహం మేడిగడ్డ పరుగులు పెడుతుంది.దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.