తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో 3వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నా అన్నారు ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు. ఉదయం 11.30 నిమిషాలకు శాసన సభలో తాను ,మండలి లో మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. కోకాపేట్ లో తన నివాసం నుంచి బయలుదేరాక మీడియాతో మాట్లాడారు.
ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా, ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంటుందన్నారు హరీష్ రావు. మానవీయ కోణంలో ఈ బడ్జెట్ ను రూపొందించామన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా బడ్జెట్ ఉండబోతుందన్నారు. అనంతరం జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయానికి చేరుకున్న ఆర్థికమంత్రి హరీష్ రావు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో మంత్రి హరీష్ రావుతో పాటు మరో మంత్రి దయాకర్ రావు పాల్గొన్నారు.
నిన్న సాయంత్రం రాష్ట్ర బడ్జెట్‌ను కేబినెట్ ముందు వుంచారు. రాబడులు, కేటాయింపులు, ప్రాధాన్యతలను ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు కేబినెట్‌కు వివరించారు. అనంతరం బడ్జెట్‌ను మంత్రివర్గం ఆమోదించింది. దాన్ని ఇవాళ ఉభయసభల్లో ప్రవేశపెడతారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం 2.30 లక్షల కోట్ల బడ్జెట్‌ని ప్రవేశపెట్టింది. గత రెండేళ్లు బడ్జెట్ పరిమాణాన్ని పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం క్రితం ఏడాది అంచనాలపై 20 శాతానికి పైగానే పెంచారు. తాజాగా ఈ పెంపు కొనసాగుతుందంటున్నారు.