ఆదివారం సాయంత్రం పటాన్‌చెరువులో పర్యటించిన మంత్రి హరీశ్ రావు.. రూ. 8.30 కోట్ల అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. రూ. 3.40 కోట్లతో నిర్మించిన స్పోర్ట్స్ బిల్డింగ్‌తో పాటు రూ. 3.85 కోట్లతో ఆధునీకరించిన మైత్రి క్రీడా మైదానాన్ని.. అలాగే రూ. 1.10 కోట్లతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఏడున్నర కోట్లతో పటాన్‌చెరువు స్టేడియం నిర్మాణం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు.
రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన హరీశ్ రావు.. పల్లె ప్రగతి భాగంగా ప్రతి ఊరిలో క్రీడా మైదానాల ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ప్రతి ఊరిలో యువకుల కోసం ప్రభుత్వం స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వబోతోందని స్పష్టం చేశారు. అంతేకాదు.. రూ. 300 కోట్లతో పటాన్‌చెరువులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.
అంతకుముందు.. హరీశ్ రావు వైద్యాధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. డీఎంహెచ్‌ఓ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు నెలలో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలని నిర్దేశించిన ఆయన.. జులై నాటికి ప్రైవేటు ఆసుపత్రుల పని తీరు మారకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాల రేటు తగ్గించాలని డిమాండ్ చేశారు.