కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్, బీజేపీ నేతలు తెలంగాణలో తమ ఉనికి చాటేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వరుస విమర్శలు చేస్తున్నారు. ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేశారని, పథకాల పేర్లతో ప్రజల డబ్బుని దోచేసుకున్నారని, బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి రాష్ట్రాన్ని బాకీల తెలంగాణగా మార్చారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రంగంలోకి దిగి, ఆయా విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చారు.
కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందని.. కానీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు సీఎంను, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రెండు జాతీయ పార్టీల నాయకులు అసత్యాలను ప్రచారం చేస్తూ, రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చే పని చేస్తున్నారన్నారు. గత ఎనిమిదేళ్ళ నుంచి దేశం తిరోగమనంలో ప్రయాణిస్తోందంటే, దానికి కేంద్ర ప్రభుత్వ పాలనే ప్రధాన కారణమని ఆరోపించారు. బంగ్లాదేశ్ కన్నా మన దేశ జిడిపి శాతం తక్కువగా ఉందని.. ఆహార సమస్య, ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో మన దేశమూ చేరిందన్నారు.
పెట్రోల్, డీజిల్, నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయని.. ధరల్ని కంట్రోల్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. దేశానికి కావాల్సింది డబుల్ ఇంజన్ సర్కార్ కాదని.. ధరల్ని కంట్రోల్ చేయడంతో పాటు మత సామరస్యాన్ని కాపాడే సర్కార్ కావాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న డబుల్ ఇంజన్ ప్రభుత్వాలన్నీ ట్రబుల్ ఇంజన్ ప్రభుత్వాలుగా మారాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు టీఆర్ఎస్ పార్టీకి ఏటీఎంగా మారిందని బీజేపీ నేతలనడం నిజంగా సిగ్గచేటని, స్వయంగా కేంద్రమంత్రి గడ్కరీ ఇదొక గొప్ప ప్రాజెక్ట్ అంటూ ప్రశంసించారని గుర్తు చేశారు.
ఇక కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రంలో దారుణంగా ఉందని చెప్పిన గుత్తా.. రాహుల్ గాంధీని రాష్ట్రానికి తీసుకొచ్చి రైతు సంఘర్షణ సభ పెట్టారని, అసలు అది ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియదని సెటైర్ వేశారు. ‘‘కాంగ్రెస్, బీజేపీ పాలిత ప్రాంతాల్లో రైతు బంధు, రైతు భీమా, 24 గంటల ఉచిత కరెంట్, ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయడం, ఇంకా మరిన్ని పథకాల్ని అమలు చేసే దమ్ము ఉందా? అది మన రాష్ట్రానికే సాధ్యం’’ అని చెప్పారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం పైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు.
కొత్తగా ఇల్లు కట్టుకుంటేనే కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయని, అలాంటిది అంత పెద్ద ఆలయ నిర్మాణం జరిగినప్పుడు ఎక్కడో సమస్యలు ఎదురవ్వడం సహజమన్నారు. ఈ ఆలయ అభివృద్ధిపై తెలంగాణ సర్కార్‌కు ప్రత్యేక శ్రద్ధ ఉందని, అన్ని సమస్యలు త్వరగా పరిష్కరమవుతాయని భరోసా ఇచ్చారు. నల్లగొండ జిల్లాకు చెందిన ప్రతిపక్ష నేతలు నెల విడిచి సాము చేస్తున్నారన్న గుత్తా.. రెండు జాతీయ పార్టీల అధ్యక్షులకు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని హెచ్చరించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, నియామకాల కోసం మాట్లాడితే బాగుంటుందని గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు.
Minister Harish Rao : ఈ నెల 12న హాస్పిటల్స్ వద్ద ఉచితంగా భోజనం