యాసంగి ధాన్నాన్ని నేటి నుంచి తెలంగాణ ప్రభుత్వం కొనుగోళు చేయనుంది. ఈ నేపథ్యంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో పండిన ధాన్యం కేంద్రం కొనాల్సి ఉన్నా కొనకపోవడంతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పండిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ రైతు బాంధవుడిలా రైతులు నష్టపోవద్దనే ఈరోజు నుంచే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారని ఆయన వెల్లడించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు పచ్చి ధాన్యం తీసుకొని రాకుండా ప్రభుత్వం నిబంధనలు మేరకు ధాన్యం తీసుకొని వచ్చి రైతులు మద్దతు ధర పొందాలని ఆయన సూచించారు. బీజేపీ నాయకులు వీలైతే రాష్ట్రానికి సహాకరించాలే తప్ప విమర్శలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. కేంద్రం మొండి వైఖరి వల్ల రైతులకు నష్టం జరగకుండా సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా రైతులకు ఇబ్బందులు జరగకుండా సరిహద్దుల్లో చెక్ పోస్టులు పెట్టాలన్నారు.