తెలంగాణ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఓ కటింగ్ షాపు ఓనర్ ఉచితంగా కటింగ్, షేవింగ్ చేస్తున్నాడు. జూబ్లీహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలో ఫుట్‌పాత్‌పై బ్యానరు కట్టి ప్రజలకు కటింగ్, షేవింగ్ చేస్తున్నాడు. తెలంగాణ సాధించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని.. ఆయన పుట్టినరోజు కాబట్టి గత రెండేళ్లుగా తాను పేదవాళ్లకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉచితంగా కటింగ్, షేవింగ్ చేస్తున్నట్లు సదరు వ్యక్తి వెల్లడించాడు.
కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కాకుండా బీసీలకు బీసీ భవన్ కట్టించారని.. అంతేకాకుండా పేదవాళ్లను ఇళ్లు కట్టించి ఇస్తున్నారని కటింగ్ చేసే వ్యక్తి ప్రశంసించాడు. కేసీఆర్ తరహాలోనే తాను కూడా పేదవాళ్లకు ఎంతో కొంత ఉపయోగపడాలని భావించానని.. తన వృత్తి ఇదే కాబట్టి తాను ఇక్కడ నివసించే పేదవాళ్లకు ఉచితంగా కటింగ్, షేవింగ్ చేస్తున్నట్లు వివరించాడు.