కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సమయంలో.. ఆక్సిజన్ అందక చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.. దీంతో.. త్వరిత గతిన ఆక్సిజన్ తరలింపునకు ప్రత్యేక రైళ్లు, విమానాలు నడుపుతోంది ప్రభుత్వం.. అయితే, ఆక్సిజన్ ట్యాంకర్లు తరలిస్తున్న గూడ్స్ రైలులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. శనివారం హైదరాబాద్ నుండి చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్ కి వెళ్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ల గూడ్స్ రైలులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి.. అది గమనించిన సిబ్బంది.. పెద్దపల్లి జిల్లా సమీపంలోని 38వ గేటు వద్ద రైలును నిలిపివేసి మంటలను అదుపుచేశారు.. సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తేవడంతో పెను ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు.. ఈ ప్రమాదంలో ఆక్సిజన్ ట్యాంకర్లు ఉండడంతో.. స్థానిక పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.