దేశ చరిత్రలో హుజురాబాద్ ఎపిసోడ్ చీకటి అధ్యాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇవాళ నామినేషన్ దాఖలు చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నా నియోజకవర్గ ఎపిసోడ్ ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా అభివర్ణించారు. అడ్డదారుల్లో ప్రలోభాలతో మద్యం, డబ్బుతో గెలవాలని టీఆర్ఎస్ కుట్ర పన్నుతోందని ఆరోపించిన ఈటల రాజేందర్.. నాయకులకు, ప్రజా ప్రతినిధులకు కొనుగోలు చేసే దారుణం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, ఎన్ని కుట్రలు చేసినా హుజురాబాద్‌లో 100 శాతం కమలం పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఈటల రాజేందర్.. సర్వేలు మొత్తం కమలం పార్టీకే మొగ్గు చూపుతున్నాయని వెల్లడించారు.
మరోవైపు.. హుజురాబాద్ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా అభివర్ణించారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. ఇంత భయంకరమైన అధికార దుర్వినియోగం ఇంత ఘోరమైన పరిస్థితులు గతంలో ఎక్కడ చూడలేదన్న ఆయన.. రాష్ట్రంలో మేమే ఉండాలి, మా కుటుంబమే ఉండాలి అనేది దుర్మార్గమైన ఆలోచన అని.. అందుకే ప్రతీ ఓటు అంబేడ్కర్ తీసుకొచ్చిన ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా ఉండాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ సర్కార్ హుజురాబాద్ లో అన్ని అడ్డదారులు తొక్కిందని ఆరోపించిన కిషన్‌రెడ్డి.. దళితబంధు పథకం తేవడం పట్ల గర్వంగా భావిస్తున్నాం.. దళిత బంధు పథకం క్రెడిట్ హుజురాబాద్ ప్రజలకు, ఈటల రాజేందర్‌కు దక్కుతుందన్నారు. దళిత బంధు పథకానికి హుజురాబాద్ ఈటల రాజేందర్ పథకంగా నామకరణం చేయాలని వ్యాఖ్యానించిన ఆయన.. దళిత బంధు పథకం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.