టీఆర్ఎస్ బహిస్కృత నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేసి ఈ విషయాన్ని ప్రకటించారు. ఉరిశిక్షపడిన ఖైదీకి కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారని, కానీ, ఏం జరిగిందో తెలుసుకోకుండా చర్యలు తీసుకున్నారని, రాత్రికి రాత్రే విచారణ చేసి బర్త్‌రఫ్ చేశారని ఈటల ఆరోపించారు. 19 ఏళ్లుగా టీఆర్ఎస్‌లో ఉన్నానని, ఓ అనామకుడు లేఖరాస్తే రాత్రికి రాత్రే మంత్రిమీద విచారణ చేస్తారా అని ప్రశ్నించారు. తనపై జరుగుతున్న దాడి, కుట్రలపై ప్రజలు ఆవేదన చెందుతున్నారని ఈటల పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో ఏ ఎన్నికలు జరిగినా పార్టీని గెలిపించుకున్నామని, డబ్బులు, కుట్రలతో అధికార పార్టీ గెలవొచ్చని ఈటల పేర్కొన్నారు. కేసీఆర్‌ను కలిసేందుకు రెండుసార్లు ప్రయత్నించనని, కానీ, అవకాశం ఇవ్వలేదని ఈటల తెలిపారు.