రాబోయే కాలంలో తెలంగాణలో ఎగిరేది బీజేపీ జెండానే అని.. కాంగ్రెస్ దీపంలో ఢిల్లీలోనే ఆరిపోయిందని.. తెలంగాణలో వచ్చే అవకాశమే లేదని.. టీఆర్ఎస్ పార్టీని ఎవరూ నమ్మడం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. రాబోయే కాలంలో బీజేపీ ప్రళయం వస్తుందని అన్నారు. అద్వానీ రథయాత్ర చేసి ఆర్టికల్ 370 రద్దు చేయాలని, రామ మందిరం నిర్మించాలని యాత్ర చేశారని.. మోదీ నాయకత్వంలో ఈ రెండు సాధ్యమయ్యాయని అన్నారు. ట్రిపుల్ తలాక్ వ్యతిరేఖంగా బీజేపీ ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణలో ప్రజా వ్యతిరేక, ప్రజా కంఠక ప్రభుత్వంపై బీజేపీ పార్టీ కొట్లాడుతుందని ఆయన అన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం అని విమర్శించారు. తెలంగాణలో నేనే రాజును, నేనే చక్రవర్తిని, నేనే సీఎం అని నేను ఏం చేసిన చెల్లబాటు అవుతుందని అనుకుంటున్నారని…ఇది అంతం కావడానికి తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలి అని అన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోలీస్ స్టేషన్లకు పిలుస్తున్నారని, కేసులు పెడుతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లో మన అధికారం మాత్రమే ఇలాంటి దుర్మార్గాలకు చరమగీతం పాడుతుందని అన్నారు. జిల్లా స్థాయి నాయకులు గ్రామస్థాయిలో నాయకత్వాన్ని ప్రోత్సహించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.