Etela Rajender criticized CM KCR: బైంసాలో జరుగుతున్న బీజేపీ బహిరంగ సభలో నాయకులు, టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ తన చెప్పు చేతుల్లో పోలీసులను పెట్టుకున్నారని.. పోలీసులు 5వ విడత ప్రజాసంగ్రామ యాత్ర బహిరంగం సభను అడ్డుకోవాలని చూశారని హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ విమర్శించారు. కోర్టు బహిరంగ సభకు అనుమతి ఇచ్చిందని అన్నారు. ఇంతపెద్ద పార్టీ బహిరంగ సభ రెండు గంటలే ఉంటుందా..? అని ప్రశ్నించారు. కోర్టు ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని అన్నారు.
Read Also: Kishan Reddy: వెయ్యి బీఆర్ఎస్‌లు, ఎంఐఎంలు వచ్చినా మోదీని ఏం చేయలేవు.. కేసీఆర్ పతనం ప్రారంభమైంది
కేసీఆర్ పాలనలో చదువులమ్మ ఒడి అయిన బాసరలో ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు తమ హక్కుల కోసం ఉద్యమాన్ని చేశారని గుర్తు చేశారు. విద్యార్థుల ఉద్యమంతో కేసీఆర్ కొడుకు కేటీఆర్ దిగి వచ్చాడని అన్నారు. బాసర విద్యార్థులకు హ్యాట్సాఫ్ అని ఈటెల ప్రశంసించారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో మంచి భోజనం పెట్టకుండా.. బల్లులు పడిని ఆహారాన్ని తిని విద్యార్థుల అనారోగ్యం పాలై, ఆస్పత్రులకు వెళ్తున్న పరిస్థితి తెలంగాణలో ఏర్పడిందన్నారు. ప్రజలు నివురుగప్పిన నిప్పులా ఉన్నారని.. కేసీఆర్ ను ఓడగొట్టడమే మా ఎజెండా అని ప్రజలు అంటున్నారని ఆయన అన్నారు.
కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయి.. కానీ చేతలు మాత్రం గుమ్మం దాటవని ఎద్దేవా చేశారు. కేసీఆర్ డైరెక్షన్ లో పోలీసులు పనిచేస్తున్నారని..ఎంత మంది బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడతారని ప్రశ్నించారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని అన్నారు. రాబోయే కాలంలో పులి బిడ్డల్లా ఆదిలాబాద్ ప్రజలు బీజేపీ గెలుపు కోసం ప్రయత్నం చేయాలని కోరారు.