ఈమధ్యకాలంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరగడం, కొంతమంది ప్రాణాలు పోతుండడం, బైక్ లు ధ్వంసం కావడంతో తనిఖీలు పెంచారు పోలీసులు. బంజారాహిల్స్ పార్క్ హయత్ దగ్గర సాధారణ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులకు చుక్కలు చూపించారు మందు బాబులు.
రోడ్డు కు అడ్డంగా పడుకోవడంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలిగింది. కొంతమందిని పోలీసులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు అని ఆరోపిస్తూ రోడ్డుకి అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు. వీరి మధ్యలోకి హిజ్రాలు వచ్చి నానా హంగామా చేశారు. హిజ్రాలు బట్టలు విప్పి మరీ చిందులు తొక్కారు. పోలీసులను బూతులు తిట్టారు హిజ్రాలు. మూడు గంటల పాటు హల్చల్ చేశారు.
నేను మేడ్చల్ ఎమ్మెల్యే తమ్ముణ్ణి, నన్నే ఆపుతారా అంటూ పోలీసుల పై దౌర్జన్యం చేశాడో యువకుడు. సరైన పత్రాలు చూపించక పోవడంతో వెహికల్ ని ఇవ్వలేదు పోలీసులు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. రోడ్డు పై వచ్చే మిగతా వాహనాలని ఆపుతూ వీరంగం కలిగించాడు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి పేరుతో స్టిక్కర్ ఉన్న కారుని అడ్డగించి, లోపల ఉన్నవారు బయట దిగాలని పోలీసులతో వాగ్వాదం చేశాడు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారుకు జరిమానా విధించారు పోలీసులు. గంటల తరబడి ఇతర వాహనాలకు, పబ్లిక్ కు న్యూసెన్స్ చేస్తూ ఉండడంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
