ఇప్పటికే కరోనా ఎప్పటికప్పుడు తన రూపం మార్చుకుంటూ ఒమిక్రాన్, డెల్టా వేరింయంట్ల రూపంలో టెన్షన్ పెడుతుంటే మరోవైపు తెలంగాణలో కొత్త వ్యాధి విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో స్ర్కబ్ టైఫస్ అనే వ్యాధి బారిన పడ్డవారు ఏకంగా 15మంది చికిత్స తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెలలో నలుగురు చిన్నారులు ఆస్పత్రుల్లో చేరారని ఇప్పటికే ఇద్దరికి వ్యాధి నయమైందని అధికారులు వెల్లడించారు. ఈ వ్యాధి ఎక్కువగా చిన్నారుల్లో కనిపిస్తుందని వైద్యులు పేర్కొన్నారు.
ఈ వ్యాధికి సంబంధించి ఇటీవల ఒడిశా రాష్ర్టంలో 500కేసులకు పైగా నమోదైనట్టు తెలిపారు. అటు యూపీలోనూ చాలా మంది చిన్నారులకు ఈ వ్యాధి సోకినట్టు వైద్యులు వెల్లడించారు. స్ర్కబ్ టైఫస్ పురుగులు కుట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుందని, ఈ పురుగులు చూడటానికి చిన్న నల్లిని పోలి ఉంటాయన్నారు. ఈ వ్యాధి సోకిన వారు తీవ్రమైన జ్వరం, చలి, తలనొప్పి, కళ్లు, ఒళ్లు కండరాల నొప్పులతోపాటు దద్దుర్లు వస్తాయని వైద్యాధికారులు పేర్కొన్నారు. పురుగు కాటుకు గురైన పదిరోజుల్లోపు ఈ లక్షణాలు ప్రారంభమ వుతాయని, అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు.