పేదలకు పట్టాలు ఇచ్చిన స్థలంలో నర్సింగ్ కాలేజీ కట్టడం సిగ్గు చేటని, మాజీ మంత్రి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో వైద్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటనకు ముందు బీజేపీ నాయకులతో పాటు, అఖిలపక్ష నేతలను అరెస్టు చేయడాన్ని డీకే అరుణ ఖండించారు. తను మంత్రిగా ఉన్నప్పుడు అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే, నేడు అదే స్థలం లో నర్సింగ్ కాలేజీ నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం వెనుక ఆంతర్యం ఏమిటనిడీకే అరుణ ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకులకు భూములను విచ్చలవిడిగా కబ్జాలు చేస్తున్నారని, నర్సింగ్ కాలేజీ కోసం భూమి దొరకడం లేదా అని డీకే అరుణ తీవ్రంగా ధ్వజమెత్తారు. గద్వాల్లో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నపటికీ, కావాలని పేదలకు పట్టాలు ఇచ్చిన స్థలం లో నర్సింగ్ కాలేజీ నిర్మాణ పనులు చేపట్టడం సరికాదన్నారు.
వైద్య శాఖ మంత్రికి కనీసం జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారని డీకే అరుణ నిప్పులు చెరిగారు. నర్సింగ్ కాలేజీకి తాము వ్యతిరేకం కాదని, పేదల పట్టాలు ఇచ్చిన స్థలంలో నిర్మాణం చేసి రెచ్చ గొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని డీకే అరుణ వ్యాఖ్యానించారు. కచ్చితంగా ఈ ప్రభుత్వానికి పేద ప్రజల ఊసురు తాకుతుందని డీకే అరుణ మండిపడ్డారు. పేద ప్రజల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమేనని, ప్రాణ త్యాగానికి కూడా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని డీకే అరుణ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.