ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు కొత్త కష్టం వచ్చింది. ధరణి పోర్టల్ లో రిజిస్ట్రేషన్ స్లాట్ రద్దుచేసుకున్న వారికి ఏడాది గడిచినా ఇంకా డబ్బులు అందలేదు. ఇలా దాదాపు 2 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉండడంతో ఎప్పుడు వస్తాయోనని ఎదురు చూపులు తప్పడం లేదు.
గత ఏడాది అక్టోబర్లో ధరణి సేవలు తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. అదే నెల 28 నుంచి తహశీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం మొదట స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఆయా ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువల్ని బట్టి స్లాట్ ఫీజ్ చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించి బుకింగ్ చేసుకున్న తరువాత రిజిస్ట్రేషన్ తేదీని నిర్ణయించి సంబంధిత వ్యక్తికి సమాచారం ఇస్తారు. అయితే వివిధ కారణాల వల్ల స్లాట్ రద్దు చేసుకున్న వారికి ఆ డబ్బు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇంతవరకు ఆ డబ్బు చాలా మందికి అందలేదు.
ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలో 1055 మంది, సూర్యాపేట లో 612 మంది, యాదాద్రి భువన గిరి జిల్లాలో 488 మంది ఇప్పటి వరకు స్లాట్ రద్దు చేసుకున్నారు. వీరిరి దాదాపు రెండు కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్నా… ఇంతవరకు అతీగతీ లేదని ఆవేదన చెందుతున్నారు. ఇటు అధికారులు మాత్రం రద్దు చేసుకున్నవారికి త్వరలోనే అకౌంట్లలో డబ్బులు పడతాయని అంటున్నారు. అకౌంట్లలో డబ్బులు వేస్తారు సరే… అది ఎప్పుడు జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు రైతులు. త్వరగా చెల్లించాలని కోరుతున్నారు.