Ponguleti Srinivas Reddy : వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో శనివారం ఘనంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్–పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, యువజన–క్రీడల, పశువర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి రెండు ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. ఇంటి యజమానులకు పూలదండలతో సన్మానం చేసి, వస్త్రాలను అందజేయడం ద్వారా వారికి సంతోషాన్ని కలిగించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ జోడెద్దుల్లా సమపాళ్లలో ముందుకు వెళ్తున్నాయి అని స్పష్టం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కేవలం కమిషన్‌ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుపైనే దృష్టి పెట్టిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. పేదల గౌరవప్రదమైన జీవనానికి ప్రతీకగా నిలిచే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.
Monsoon Mosquito Prevention: వర్షాకాలంలో దోమల బెడద.. ఈ చిట్కాలు పాటిస్తే అస్సలు కుట్టవు..!
ప్రజా ప్రభుత్వమే నిజమైన రైతు–కూలీలకు అండగా నిలుస్తోందని మంత్రి పొంగులేటి వివరించారు. రైతును “రాజు”గా చూడాలనే సంకల్పంతోనే సన్నవరి వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. తొమ్మిది నెలల వ్యవధిలోనే రూ.21 వేల కోట్లతో రెండు లక్షల లోపు ఉన్న రైతుల రుణమాఫీ చేయడం, రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం, మూడు విడతల్లో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇండ్లు కట్టించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
అలాగే, 7 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం, 17 లక్షల పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లు నమోదు చేయడం వంటి సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వమే విజయవంతంగా అమలు చేసిందని గర్వంగా చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు మోసం తప్ప మరేం కాదని మండిపడ్డారు. “కేసీఆర్ మోచేతిపై బెల్లం పెట్టి నాకమని చెప్పిన వ్యక్తి” అంటూ ఎద్దేవా చేశారు. విశాలమైన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామంటూ మాటిచ్చి, చివరికి పిట్టగూడు లాంటి ఇళ్లు ఇచ్చారని విమర్శించారు.
అంతేకాదు, గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల పాలజేసి వెళ్ళగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భారాన్ని భరిస్తూనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఒక్క అడుగు వెనక్కి వేయడం లేదని స్పష్టం చేశారు.