తెలంగాణ ప్రజల రక్త మాంసాలతో ఏర్పడిన ప్రభుత్వ ఖజానాను సీఎం కేసీఆర్ పంజాబ్ రైతులకు సాయంగా ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. మరి తెలంగాణ రైతులను ఎవరు ఆదుకుంటారని ప్రశ్నించారు. తెలంగాణ రైతులను పంజాబ్ ముఖ్యమంత్రి ఆదుకుంటారా…? అని సెటైర్లు వేశారు. కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లో స్థానం సంపాదించుకోవాలనే స్వార్థంతోనే ఢిల్లీ వెళ్లారని విమర్శించారు.
ఢిల్లీలో పంజాబ్ రైతులు నిరసన తెలిపినప్పుడు ఒక్క రోజు కూడా సీఎం కేసీఆర్ సంఘీభావం తెలపలేదని విమర్శించారు. 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే 194 జీవో ప్రకారం కేవలం వెయ్యి మందికి మాత్రమే 6 లక్షల ఆర్థిక సహాయం చేసారని ఆరోపించారు. మిగిలిన 7 వేల మంది రైతుల కుటుంబాల్లో మన్ను కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్ రైతులకు సహాయం కేసీఆర్ ఆడుతున్న డ్రామా తప్ప దేశవ్యాప్త రైతులను ఆదుకోవాలని కాదని అన్నారు.
గజ్వేల్ లో సెల్ఫీ వీడియో తీసుకొని రైతు ఆత్మహత్య చేసుకున్నారని… టీఆర్ఎస్ నేతలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. వడ్ల కొనుగోలు ప్రారంభమై 45 రోజులు అయింది..ఇంకా 40 శాతం కూడా కొనుగోలు చేయలేదని అన్నారు. రైతు భీమా ద్వారా రైతులు ఎవరు చనిపోయిన 5 లక్షలు అన్నారు..అది ఏమైందని ప్రశ్నించారు. రుణమాఫీ ఏమైందని… 23 వేల కోట్లకు కేవలం వెయ్యి కోట్లు కేటాయించారని విమర్శించారు. పంట భీమా లేదు.. 2020 వరదల వల్ల వచ్చిన పంట నష్టపరిహారం ఇవ్వలేదు..రైతులను ఓట్ల బిచ్చగాళ్లుగా చూస్తున్నారని దాసోజు శ్రవణ్ విమర్శించారు. నెల రోజులు పాటు రైతు డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు.