మనం కష్టపడి సంపాదించిన డబ్బుల్ని బ్యాంకుల్లో దాచుకుంటాం. కంచె చేనుమేసినట్టుగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బులు భద్రమేనా..? మొన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకు, తాజాగా డిసీసీ బ్యాంక్ లో కోట్ల రూపాయలు దారిమళ్లడంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. నెలలు గడిచినా కోట్ల రూపాయల విషయం పసిగట్టకపోవడానికి లోపం ఎవ్వరిది.. ? మరి నిఘా వేయాల్సిన అధికారులేం చేస్తున్నట్టు… ? స్కాం జరిగాక రికవరీ కోసం తపన తప్ప.. కేసుల జోలికెళ్లడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల రెండు బ్యాంకుల్లో కోట్ల రూపాయలు కాజేసిన యవ్వారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది…మొన్నామధ్య తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మామిడి గూడ బ్రాంచ్ ఉద్యోగి సీఎస్పీ రమేష్, ముగ్గురు రైతుల కిసాన్ కార్డులతో ఏకంగా కోటి 28 లక్షలు మూడు నెలలుగా డ్రా చేశాడు…ఇది బ్రాంచ్ అధికారులే కాదు జిల్లాలోని ప్రధాన బ్యాంక్ అధికారులు సైతం గుర్తించ లేదు..తీరా రాష్ట్ర స్థాయి అధికారులు గుర్తించి సమాచారం ఇస్తే తప్పా, ఇక్కడి అధికారులు పసిగట్టలేకపోయారంటేనే డొల్లతనం అర్థమవుతోంది.
ఇంత జరిగినా ఇప్పటి వరకు కేసు నమోదు కాలేదు..మారుమూల గ్రామమైన మామిడిగూడ వాసి సీఎస్పీ రమేష్ కోటి 28 లక్షలు డ్రా చేసాడు.దాంతో ఒక్కరిద్దరు ఇళ్లు కట్టేసుకున్నారు. ఇక రమేష్ అయితే తన బంధువులకు ట్రాన్స్ ఫర్ చేసాడు. ఇతరత్రా డబ్బులను వాడేసుకున్నాడు.అయితే అధికారులు రికవరీ మీద ధ్యాస పెట్టారు..కానీ పూర్తి స్తాయిలో డబ్బులు రికవరీ చేయలేదు..పైగా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో, బ్యాంక్ అధికారుల పాత్ర ఏమైనా ఉందా అనే అనుమానాలకు తావిస్తుంది.
తాజాగా డిసీసీ బ్యాంక్ బేల బ్రాంచ్ లో శ్రీపతి కుమార్ అనే ఉద్యోగి కేవలం ఓచర్లు లేకుండా ఐడీలు ఎంట్రీలతో రెండు కోట్ల 86 లక్షల 46 వేలు మాయం చేశాడు. తన బంధువులు, ఇతర బ్రాంచ్ ల్లో పనిచేసే అధికారుల అకౌంట్లలోకి బదిలీ చేశాడు. జిల్లా ఉన్నతాధికారులు ఆరు నెలల తర్వాత తీరిగ్గా గుర్తించారు. సెప్టెంబర్ 2021 నుంచి ఈ ఏడాది మార్చి 7 వరకు గుర్తించలేకపోయారంటే అధికారుల పర్యవేక్షణ, బ్యాంక్ డబ్బులకు భద్రత ఎంత ఉందో అర్థమౌతుంది.
ఇప్పటి వరకు 11 మందిపై జిల్లా అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా గుట్టుగా వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. అయితే రెండు కోట్ల 86 లక్షలు బ్యాంకు డబ్బులే అంటున్న అధికారులు, ఏ డబ్బులనే విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. డిసీసీ బ్యాంక్ లో జరిగిన కుంభకోణంలో ఎట్టకేలకు చర్యలకు దిగారు. ఈనెల 7న స్కాం వెలుగులోకి వస్తే, 13న పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్టు తెలిసింది…పోలీసుల విచారిస్తే ఇంటిదొంగల గుట్ట రట్టయ్యే అవకాశం ఉంది..