తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు. ఏడేళ్ల పాలన తెలంగాణ ప్రజల ఆత్మ ఘోష కు ఉపయోగపడే పాలన అని ధ్వజ మెత్తారు. ప్రజాస్వామ్య విలువలను ముఖ్యమంత్రి కేసీఆర్ తుంగలో తొక్కారని విమర్శించారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీడియాతో నారాయణ మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు అయిందన్నారు. రాష్ట్రం ఆరంభంలోనే ఇది భౌగోళికంగా తెలంగాణ నా, ప్రజాస్వామ్య తెలంగాణ నా అనే చర్చ వచ్చింది. అయితే కేసీఆర్ విజయ వంతంగానే భౌగోళిక తెలంగాణ గానే ఉద్యమాన్ని నడిపించారని పేర్కొన్నారు. ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి నిర్మాణాన్ని బలోపేతం చేసుకున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో జాతీయ పార్టీగా సిపిఐ ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాంతాలకు అతీతంగా ఒకే మాట మీద నిలబడిందని నారాయణ గుర్తు చేశారు. కాంగ్రెస్, బిజెపి, తెలుగుదేశం పార్టీలు తెలంగాణలో ఒక లైన్, ఆంధ్రాలో ఒక లైన్ తీసుకున్నాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో వివిధ రాజకీయ పార్టీలు పోరాటంతో పాటు కళాకారులు మేధావులు కీలక పాత్ర పోషించారని చెప్పారు. సాంస్కృతిక ఉద్యమం, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పోరాటం చారిత్రకం అని ,1500 మంది యువకులు బలిదానం చేసుకున్నారని అన్నారు. చివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అయితే కాంగ్రెస్ పార్టీ తామే ఇచ్చామని చెప్పుకుందని అన్నారు. అన్ని పార్టీలు చేసిన పోరాటం మొత్తాన్ని కేసీఆర్ తన అకౌంట్లో వేసుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ పోరాటంలో చురుగ్గా పాల్గొన్న కమ్యూనిస్టు పార్టీని సైతం కేసీఆర్ చాలా తెలివిగా దూరంగా పెట్టారని అన్నారు.
ప్రజాస్వామ్య ఉద్యమాలను కేసీఆర్ అణచివేయాలని చూస్తున్న తరుణంలో బిజెపి ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు సిద్ధ పడుతోందన్నారు. హైదరాబాద్ ఎన్నికల్లో సైతం బిజెపి బలపడిందంటే అది కెసిఆర్ చేసుకున్న స్వయంకృతాపరాధమే అన్నారు. తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర వహించిన కోదండరాం దూరమయ్యారని, నేడు ఈటెల రాజేందర్ బయటకు వచ్చారన్నారు. ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు అనుకూలంగా వ్యవహరించిన వారికి కేసీఆర్ పెద్దపీట వేశారని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన రోజుల్లో కొన్ని ప్రాంతాలు దోపిడీకి గురవుతున్నాయని చెప్పిన నేతలు అదే ప్రాంతాల్లో దోపిడి చేస్తున్నారని పేర్కొన్నారు. నాడు పోరాడిన వాళ్లే నేడు కాంట్రాక్టర్ల అవతారమెత్తి దోచుకుంటున్నారని అన్నారు.