Chada Venkat Reddy: కమ్యూనిస్టుల త్యాగాలు చాలా గొప్పవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో ఆర్ఎస్ఎస్ బ్రిటీశ్ వాళ్లకు తొత్తులుగా వ్యవహారం చేసిందని ఆయన ఆరోపించారు. ఇప్పుడు గొప్పలు చెప్తున్న మోడీ పార్టీ ఆ సమయంలో లేనే లేదన్నారు. స్వాతంత్ర పోరాటంలో ఎన్నో త్యాగాలు చేసింది కమ్యూనిష్టులేనన్న ఆయన.. స్వాతంత్ర పోరాటంలో లేని వాళ్లే ఎక్కువ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజాస్వామ్యం కూనీ అయ్యిందని ఆయన విమర్శించారు. మోడీ సర్కారు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని చాడ ఆరోపించారు.
Interesting Facts: నదుల్లో కాయిన్స్ ఎందుకు వేస్తారో మీకు తెలుసా?
తొమ్మిది రాష్ట్రాల ప్రభుత్వాల్ని కేంద్రంలోని మోడీ సర్కారు కూల్చిందన్నారు. తెలంగాణలో కూడా బీజేపీ పాగా వేసేందుకు కుట్రలు పన్నుతోందన్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ … రేషన్ షాప్లో మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని అడుగుతూ దిగజారి ప్రవర్తిస్తోందని ఆయన విమర్శించారు. కేంద్రం గ్యాస్, సిలిండర్ ధరలు పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ సాయుధ పోరాటాన్ని కూడా వక్రీకరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అబద్ధాల ప్రచారం చేస్తోందని విమర్శలు గుప్పించారు. కమ్యూనిస్టుల పోరాటం లేకుండా ఏమి జరగలేదని చాడ వెంకట్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17ను కూడా కేంద్రం వక్రీకరిస్తోందని ఆయన ఆరోపించారు.
తెలంగాణ భూమి తిరుగుబాటుకి నిదర్శనమని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. నిజాంను తరిమిన గడ్డ ఇది అని, సాయుధ పోరాటం చేసిన ప్రాంతం ఇదంటూ ఆయన వెల్లడించారు. అమిత్ షా సెప్టెంబర్ 17న వస్తున్నారని.. అసలు సాయుధ పోరాటంలో బీజేపీ పాత్రనే లేదని ఆయన తెలిపారు. ఎర్రజెండా త్యాగమే సాయుధ పోరాటమన్న ఆయన.. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని బీజేపీ దెబ్బతీస్తుందన్నారు. మోడీ, అమిత్ షాల పరిపాలన తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. దేశంలో నిరుద్యోగ సమస్య, నిత్యావసర ధరలు పెరిగిపోయాయన్నారు. అదానీ.. మోడీకి మంచి మిత్రుడని ఆయన అన్నారు. మోడీ కార్పొరేట్ శక్తులతో కుమ్మక్కు అయ్యారని.. కార్పొరేట్ శక్తుల అనుకూల ప్రభుత్వంగా మారిపోయిందని విమర్శించారు. రాష్ట్రాల హక్కులను మోడీ ప్రభుత్వం లాక్కుంటుందన్నారు. బీజేపీని గద్దె దించాలని.. లేదంటే ప్రజాస్వామ్యం చనిపోతుందన్నారు. నితీష్, కేసీఆర్లు బీజేపీకి వ్యతిరేకంగా పని చేయడానికి ముందుకు వచ్చారన్నారు. కేసీఆర్ బహిరంగంగానే మోడీని వ్యతిరేకిస్తున్నారన్నారు.