Poonam Kaur: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని వివాదాస్పద హీరోయిన్ పూనం కౌర్ కలిసింది. ఈ మేరకు కాసేపు రాహుల్ గాంధీతో కలిసి పూనం కౌర్ పాదయాత్రలో పాల్గొంది. అయితే రాహుల్ గాంధీని పూనమ్ కౌర్ కలిసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రేపుతోంది. రాహుల్ చేయిని పూనమ్ కౌర్ పట్టుకున్న ఫోటోను బీజేపీ కార్యకర్త ప్రీతి గాంధీ పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా తాత అడుగు జాడల్లో రాహుల్ గాంధీ నడుస్తున్నాడంటూ ఆమె ఆరోపణలు చేశారు. ఎడ్వినా మౌంట్బాటన్తో నెహ్రూ సంబంధం గురించి కూడా అభ్యంతరకరమైన సందేశాలను సోషల్ మీడియాలోను, వాట్సాప్లోను బీజేపీ నేతలు షేర్ చేస్తున్నారు.
ప్రీతి గాంధీ చేసిన ఈ ట్వీట్ వేలాదిగా రీట్వీట్లు, షేర్లు అయింది. చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ పోస్టులు పెట్టారు. అయితే ప్రీతిగాంధీ పెట్టిన పోస్టుపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ప్రతిగా మహిళలతో ప్రధాని మోదీ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ‘ఈ దాడి రాహుల్ గాంధీ మీద కాదు. ఆ మహిళ వ్యక్తిత్వం మీద. ఈ దాడి బీజేపీ చేస్తోందని అంటున్నారు. సిగ్గుచేటు ప్రీతి గాంధీ’ అని కాంగ్రెస్కు చెందిన రియా ట్వీట్ చేశారు.
శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేస్తూ.. ‘పురుషులతో భుజం భుజం కలిపి, చేయి చేయి కలిపి మహిళలు నడవటం దేశాన్ని బలోపేతం చేస్తుందని, ముందుకు నడిపిస్తుందనేది మీ ఉద్దేశమైతే.. పండిట్ నెహ్రూ ఒక్కరి ఆకాంక్ష మాత్రమే కాదు, బాబాసాహెబ్ అంబేడ్కర్, ఇతర స్వాతంత్ర్య సమరయోధుల కలలు కూడా నెరవేరుతాయి’ అని వ్యాఖ్యానించారు. ‘మహిళల విషయంలో బీజేపీ ఆలోచన ఎందుకు మారటం లేదో నాకు అర్థం కావటం లేదు’ అని కాంగ్రెస్ నేత ఆకాష్ శర్మ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్ ట్వీట్ చేస్తూ.. ‘అవును, రాహుల్ గాంధీ తన ముత్తాత అడుగుజాడల్లో నడుస్తూ దేశాన్ని ఏకం చేస్తున్నారు. ఇదికాక, మీ చిన్నప్పటి వేదనలు బాగా లోతుగా ఉన్నాయి. మీ చెడు ఆలోచనలను చూపుతున్నాయి. ప్రీతి మీకు చికిత్స అవసరం’ అని ఎద్దేవా చేశారు.
Read Also: Poonam kaur -Rahulgandhi Controversy Live: జారిపడబోతే పట్టుకున్నారంతే.. పూనమ్ ఫోటోపై రచ్చ
మరోవైపు ప్రీతిగాంధీ పెట్టిన పోస్టుపై నటి పూనం కౌర్ కూడా స్పందించారు. తాను జారి పడబోతే రాహుల్ గాంధీ తన చేతిని పట్టుకున్నారని పూనమ్ కౌర్ వెల్లడించారు. ప్రీతి గాంధీ పెట్టిన పోస్టు చాలా అవమానకరంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ‘నారీశక్తి’ గురించి మాట్లాడటం మీకు గుర్తుందా అంటూ ప్రశ్నించారు. మహిళల పట్ల రాహుల్ గాంధీ ఆదరణ, గౌరవం, వైఖరి తన గుండెను తాకిందని.. చేనేత కార్మికుల సమస్యల గురించి విన్నందుకు రాహుల్ గాంధీకి, చేనేత కార్మికులతో పాటు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పూనం కౌర్ ట్వీట్ చేశారు.