అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశంలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. రాహుల్.. రాజీవ్ గాంధీ కుమారుడే అన్న విషయానికి రుజువులు చూపాలని బీజేపీ ఎప్పుడైనా అడిగిందా అంటూ అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ప్రశ్నించారు. దీంతో అస్సాం సీఎంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ అస్సాం సీఎంపై నిప్పులు చెరిగారు.
బీజేపీ నేతలు ఎన్నికలు, పదవుల కోసం ఏ రకంగా దిగజారుతున్నారో అర్థంఅవుతోందని ఆయన మండిపడ్డారు. అస్సాం సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం అయిన వ్యక్తి నీచమైన పదజాలం వాడారని, ఇలాంటి పదజాలం వాడిని అస్సాం సీఎంను పదవినుంచి తొలగించి, పార్టీ నుంచి తీసివేయాలి ప్రేమ్ సాగర్ అన్నారు. ఓట్లు, సీట్లు, పదవుల కోసం దిగజారుతున్నారని, బీజేపీ నాయకత్వం వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.