ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా కింద పోటీ చేసే పార్టీ అభ్యర్థులను ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది . తెలంగాణ శాసనమండలికి జరిగే ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికయ్యే అభ్యర్థులుగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, బీ మహేశ్ కుమార్ గౌడ్, ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూర్ వెంకట్‌ల అభ్యర్థిత్వ ప్రతిపాదనకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదం తెలిపారు . నామినేషన్ల చివరి రోజైన జనవరి 18న ఇరువురు నేతలు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
మహేశ్ కుమార్ గౌడ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC)కి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండగా, వెంకట్ బల్మూర్ 2021 అక్టోబర్‌లో జరిగిన ఉప ఎన్నికలో హుజూరాబాద్ నుండి ఈటల రాజేందర్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం తెలంగాణ NSUI అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే.. తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీల బాధ్యతలపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తర్వాత తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా కింద రెండు స్థానాలు సహా ప్రస్తుతం ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ సీటుకి సహకరించిన సీఎం రేవంత్.. డిప్యూటీ సీఎం భట్టి కి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నా సేవలు గుర్తించిందని, వయసుతో సంబంధం లేకుండా పదవి ఇచ్చింది పార్టీ అని, యువతకు ప్రాధాన్యత దక్కినట్టు అయ్యిందన్నారు.