KK Report : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సర్వే వివాదం రచ్చ రేపుతోంది. కేకే సర్వే సంస్థ విడుదల చేసిన సర్వే రిపోర్ట్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్‌ఓ) సాయిరాం ను కలసి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ భేటీ కోట్ల విజయభాస్కర్ ఇండోర్ స్టేడియంలో జరిగింది.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ, కేకే సర్వే సంస్థ విడుదల చేసిన సర్వే పూర్తిగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిందని ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న సమయంలో ఇలాంటి సర్వేలను ప్రచురించడం నిషేధమని గుర్తు చేశారు. అయితే కేకే సర్వే ఉద్దేశపూర్వకంగానే విడుదలైందని, ప్రజలను ప్రభావితం చేసే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. కేకే సర్వే రెండు గంటల్లోనే తయారు చేసిన ఒక లిస్ట్‌ను “సర్వే రిపోర్ట్”గా విడుదల చేసిందన్నారు. ఇది పూర్తిగా కేటీఆర్, హరీష్ రావు డైరెక్షన్‌లో జరిగిన చర్య అని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఈ సర్వే ఉపయోగపడిందని అన్నారు.
గతంలో హర్యానాలో కూడా కేకే సర్వే సంస్థ ఇలాగే అడ్డగోలుగా సర్వేలను విడుదల చేసి, ఫలితాలు అసలు వాస్తవాలకు పొంతన లేకుండా ఉన్నాయని గుర్తు చేశారు. ఇలాంటి తప్పుడు సర్వేల ద్వారా ప్రజల అభిప్రాయాలను మలుపు తిప్పే ప్రయత్నాలు అంగీకారయోగ్యం కాదని వారు పేర్కొన్నారు. కేకే సర్వే సంస్థపై చర్యలు తీసుకోవాలని ఆర్‌ఓను కోరిన ఎమ్మెల్సీలు, రేపు ఎలక్షన్ కమిషన్ కమిషనర్‌ను ప్రత్యక్షంగా కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అదనంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌కు కూడా మెయిల్ ద్వారా ఫిర్యాదు పంపనున్నట్లు చెప్పారు. “జూబ్లీహిల్స్‌లో ఓటమి ఖాయం అని తెలుసుకున్న కేటీఆర్, హరీష్ రావు ఇలాంటి డ్రామాలకు దిగుతున్నారు. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. మా అభ్యర్థి ఘన విజయాన్ని సాధిస్తారని సంపూర్ణ విశ్వాసం ఉంది,” అని బల్మూరి వెంకట్ అన్నారు.