హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ మరో 3 నెలల్లో అందుబాటులోకి రానున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు 95శాతం పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, డీజీపీ మహేందర్‌రెడ్డి, సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌తో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భవనంలోని అన్ని టవర్లను, డేటా సెంటర్లను, హెలీపాడ్‌ను సందర్శించారు.
శాంతిభద్రతలు రాష్ట్రంలో మరింత పటిష్టంగా అమలు చేసేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉపయోగపడుతుందని, పోలీస్‌శాఖతో పాటు ఇతర శాఖల అధికారులు సమావేశమై విపత్కర పరిస్థితులు ఎదురైన సమయంలో పరిష్కరించేందుకు అనువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సక్రమంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే చెప్తుంటారనీ, ఇందుకు అనుగుణంగానే నిధులు కేటాయిస్తున్నారన్నారు.