కొత్తగా నిర్మిస్తున్న తెలంగాణ సెక్రటేరియట్ పనులను మంగళవారం నాడు సీఎం కేసీఆర్ పరిశీలించారు. ప్రగతి భవన్ నుంచి సచివాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ పనులను పర్యవేక్షించారు. ఆరు అంతస్థుల సెక్రటేరియట్ నిర్మాణ పనులు పూర్తవగా.. వారం రోజుల క్రితం సీఎం కేసీఆర్ సెక్రటేరియట్ పనులను పరిశీలించాల్సి ఉంది. అయితే కొన్ని కారణాలతో ఈ కార్యక్రమం రద్దు కావడంతో నేడు సెక్రటేరియట్‌ను సీఎం కేసీఆర్ సందర్శించారు. సెక్రటేరియట్ లో ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించి కేసీఆర్ పలు సూచనలు చేశారు. ప్రస్తుతం సెక్రటేరియట్ లో ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయి. సెక్రటేరియట్ నిర్మాణ పనులు ప్రస్తుతం మూడు షిప్టుల్లో జరుగుతున్నాయి. ఏ ఒక్క రోజూ కూడా పనులు నిలిపివేయకుండా చేస్తున్నారు.
అయితే కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ సందర్శించడం ఇది 5వ సారి. 2020 అక్టోబర్ 28న టెండర్లు ఖరారు కాగా.. టెండర్ దక్కించుకున్న సాపూర్ జి పల్లం జి కంపెనీ.. టెండర్ లు దక్కించుకున్న వెంటనే పనులు ప్రారంభించింది. అయితే అంతకు ముందే పాత భవనాల కూల్చివేత జరిగింది.
జనవరి 26.. 2021న మొదటి సారి నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం.. మార్చి 18 న, ఆగస్ట్ 7న, డిసెంబర్ 9న నాలుగో సారి పనులను పరిశీలించారు. 2022 జనవరి 9న సచివాలయ నిర్మాణ పనులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. 2021 ఫిబ్రవరిలో జైపూర్‌కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెళ్లారు. ప్రస్తుతం 80 శాతం నిర్మాణాలు పూర్తైనట్లు తెలుస్తోంది.