రంగారెడ్డి జిల్లాలో 12యేళ్ల బాలికకు 35యేళ్ల వ్యక్తితో వివాహం జరిగింది. అదీ బర్త్ డే చేస్తున్నామన్న పేరుతో తల్లిదండ్రులు ఆమెకు వివాహం జరిపించారు. దీంతో పోలీస్ కేసు నమోదయ్యింది.
రంగారెడ్డి జిల్లా పరిధిలోని కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో బాల్య వివాహం జరిపించారు. 12 ఏండ్ల వయసున్న బాలికను 35 ఏండ్ల వ్యక్తికి కట్టబెట్టారు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా.. పుట్టిన రోజు వేడుక పేరుతో ఈ వివాహ వేడుకను నిర్వహించారు తల్లిదండ్రులు.
అయితే తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని బాలిక తన బంధువుల ఇంటికి వెళ్లింది. తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి.. బంధువులతో గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆ పాప అక్కడ్నుంచి వెళ్లిపోయింది. మొత్తంగా ఈ విషయం ఐసీడీఎస్ అధికారులకు చేరింది. దీంతో ఐసీడీఎస్ అధికారులు పాపిరెడ్డిగూడ చేరుకుని బాధితురాలిని చేరదీశారు. తనకు బర్త్ డే పేరిట పెళ్లి జరిపించారని బాధిత బాలిక గ్రామస్తులకు, ఐసీడీఎస్ సిబ్బందికి తెలిపింది. ఐసీడీఎస్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కాగా.. 27-05-2021 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి గ్రామంలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. 17 ఏళ్ల యువతికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు యత్నించారు. విషయం తెలుసుకున్న అశ్వారావుపేట ఎస్సై చల్ల అరుణ, రెవిన్యూ సిబ్బంది, ఆరోగ్య సిబ్బందిని వెంటబెట్టుకుని యువతి ఇంటికి వెళ్లి వివాహాన్ని నిలిపివేశారు.
అనంతరం యువతి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అమ్మాయికి 18 ఏళ్లు నిండాకే వివాహం చేయాలని సూచించారు. మేజర్ కాకుండానే పెళ్లి చేసేందుకు యత్నిస్తే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్య వివాహం చేయడం వల్ల జరిగే అనార్థాలను తల్లిదండ్రులకు వివరించారు.
Mahesh : అభిబస్ కి కోట్ల ఖర్చు… టిఎస్ఆర్ టిసి కేమో ఉచితం…