Chamala Kiran Kumar : కేటీఆర్‌పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను భూతంలా చూపించే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓట్లు దండుకోవడానికే కేటీఆర్ హైడ్రా అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. గాంధీభవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. చెరువులు, నాళాలు, ప్రభుత్వ భూములను కాపాడేందుకే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చినందువల్లే ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయని ఆయన విమర్శించారు. తెలంగాణ, హైదరాబాద్‌లో 75 శాతం చెరువులు, నాళాలు ఆక్రమణలకు గురయ్యాయని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించిందని గుర్తు చేశారు.
హైదరాబాద్‌లో 600 చెరువుల్లో 44 చెరువులు పూర్తిగా మాయం కాగా, 127 చెరువులు సగం వరకు కబ్జాలకు గురయ్యాయని వివరించారు. కేటీఆర్ మున్సిపల్ శాఖా మంత్రిగా పదేళ్లు ఉన్నప్పటికీ చెరువుల కబ్జాలను నివారించేందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే హైడ్రా వంటి సమస్యలు పుట్టుకొచ్చేందుకు కారణమని వ్యాఖ్యానించారు.
హైడ్రా ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వ భూములు, చెరువులు, నాళాలు పెద్ద ఎత్తున రక్షించబడ్డాయని ఎంపీ చామల వివరించారు. శేరిలింగంపల్లి, హఫీజ్‌పేట్‌లో 39 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఘటనలో హైడ్రా జోక్యంతో 29 ఎకరాలు కాపాడబడ్డాయని చెప్పారు. అదేవిధంగా 500 ఎకరాల ప్రభుత్వ భూమి, 360 చెరువులు, 20 నాళాలు, 38 పార్కులపై జరిగిన ఆక్రమణలను హైడ్రా తొలగించిందని వివరించారు.
“దేవరయాంజాల్‌లో ప్రభుత్వ భూములు, గచ్చిబౌలిలో ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్లాట్ ఓనర్ల భూములను హైడ్రా రక్షించింది. హైడ్రా ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాదు, అధికార దుర్వినియోగాలను వెలుగులోకి తేవడానికే ఏర్పడింది,” అని చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. “హైదరాబాద్‌ను న్యూయార్క్, లండన్‌లా మారుస్తామన్న వాగ్దానాలు కేసీఆర్ హయాంలో మాయమయ్యాయి. ఇప్పుడు ఎన్నికల దృష్ట్యా కేటీఆర్ హైడ్రాపై వ్యాఖ్యలు చేస్తున్నారు. హైడ్రా వల్ల లబ్ధి పొందిన ప్రజలే నిజం చెప్పాలి,” అని ఆయన విజ్ఞప్తి చేశారు.
BSNL: బీఎస్ఎన్ఎల్ 50 రోజుల ప్లాన్.. రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్