రెండు తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ కనిపించని పక్షి ఇప్పుడు కనిపిస్తోంది. దేశంలోనే అరుదైన పక్షిగా ఉన్న “బ్లాక్ బాజా” తాజాగా ఓ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కెమెరాకు చిక్కింది. ఈ పక్షి నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ రిజర్వు అటవీ ప్రాంతం అమ్రాబాద్ మండలం మన్ననూరు రేంజి పరిధి నల్లమల అడవిలోని ఫరహబాద్ వద్ద గుర్తించామని అమ్రాబాద్ అటవీశాఖ డివిజనల్ అధికారి రోహిత్ గోపిడి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రెండు తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ కనిపించని, దేశంలోనే అరుదైన పక్షి “బ్లాక్ బాజా” అని ఈ పక్షి చాల అందమైనది, దాని కన్నులు నలుపు రంగులో ఉంటాయన్నారు. ఈ జాతి పక్షులు నార్త్ ఇండియాలో తూర్పు హిమాలయ ప్రాంతాలు, చైనా మరియు సౌత్ ఈస్ట్ ఆసియా ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయని తెలిపారు. చలి కాలంలో శ్రీలంక, కేరళ ప్రాంతాలకు వలస వస్తుంటాయన్నారు. అమ్రాబాద్ రిజర్వు టైగర్ ప్రాంతానికి కూడా కేరళ ప్రాంతం నుండి వలస వచ్చి ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. నల్లమలలో పక్షుల గణనలో భాగంగా హైదరాబాద్ కు చెందిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ మదన్ రెడ్డి ఫరహబాద్ వద్ద తన కెమెరాలో బంధించాడు అని ఆయన తెలిపారు.
Read Also: Ration Cards: కొత్త రేషన్ కార్డుల్లేవ్… పాత కార్డుల్లో మార్పుల్లేవ్