BJP MP CM Ramesh Demanded To Not Change Health University Name: హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేయడాన్ని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ఖండించారు. ప్రపంచంలో ఆంధ్రులకు పేరు తెచ్చిపెట్టిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని, అలాంటి వ్యక్తి పేరు తొలగించడం ఏమాత్రం సబబు కాదన్నారు. కావాలంటే.. కొత్త యూనివర్సిటీ నిర్మించుకొని, దానికి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టుకోవచ్చని హితవు పలికారు. ఏపీ అవినీతి చర్చకు రాకుండా.. వర్గాల మధ్య వైషమ్యాలు తెచ్చేందుకే ఈ బిల్లు పెట్టారని ఆరోపించారు. అసెంబ్లీలో రాష్ట్ర వైఫల్యాలు, అవినీతి చర్చకు రాకుండా పక్కదారి పట్టిస్తున్నారన్నారు. పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టుల టెండర్లు లేకుండా కట్టబెడుతున్నారన్నారు. ఇసుక, లిక్కర్, మైనింగ్.. ఇలా అనేక అంశాల్లో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.
ఏపీలో అవినీతిని చూస్తూ బీజేపీ ఊరుకోదని సీఎం రమేశ్ హెచ్చరించారు. రాష్ట్రంలోని అవినీతి అక్రమాలను సీబీఐ, ఈడీ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. రాయసీమలో, ఆంధ్రలో అభివృద్ధి ఏమాత్రం లేదని.. మొత్తం దోచుకుంటున్నారని మండిపడ్డారు. కొత్త వర్సిటీకి పేరు పెట్టుకుంటే ఎవరూ అభ్యంతరం తెలపరని, పాత యూనివర్సిటీ పేరును మార్చడాన్నే రాష్ట్ర ప్రజానికం వ్యతిరేకిస్తోందని చెప్పారు. పేరు మార్చడమంటే.. పిచ్చైనా, మదమైనా ఉండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడపకు వైఎస్సార్ జిల్లా అని పేరు పెడితే, ఎవరూ అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేశారు. పాత యూనివర్సిటీలకు ఇలా ఎప్పుడూ పేరు మార్చలేదని, కేంద్ర ప్రభుత్వం సైతం ఢిల్లీలో ఏ వర్సిటీకి బీజేపీ నాయకుల పేర్లు పెట్టలేదని వెల్లడించారు. యూనివర్సిటీ పేరు మార్చడమంటే, రాష్ట్ర ప్రజల్ని అవమానపరిచినట్టేనని.. మెడికల్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలని సీఎం రమేశ్ డిమాండ్ చేశారు.