ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు, కేంద్ర మంత్రులపై విచక్షణ కోల్పోయి బూతులు మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం, భాజపా నాయకులు చేసిన తప్పేంటో కేసీఆర్ ప్రజలకు విడమర్చి చెప్పాలన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కేసీఆర్ దూషించిన భాష సభ్య సమాజం తల దించుకునేలా ఉందని, మేధావులు కేసీఆర్ భాషపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. బూతులు మాట్లాడిన కేసీఆర్ ముఖ్యమంత్రి కుర్చీలో ఉండటం సరైందేనా ఆలోచించాలన్నారు. ప్రశాంత్ కిషోర్‌ని కేసీఆర్ ఇటీవల తరుచూ కలుస్తున్నారు. పీకే డైరెక్షన్ మేరకు కేసీఆర్ ఆందోళనలు, భౌతిక దాడులు చేస్తున్నారు. వడ్ల పైన శాస్త్రీయ డిబేట్‌కు కేంద్ర మంత్రులు సిద్ధంగా ఉన్నారు.
నియోజక వర్గాల పునర్విభజన అయితలేదనే కేంద్రం మీద కక్ష కట్టారని రఘునందన్ రావు అన్నారు. ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. డీలిమిటీషన్ జరిగితే మరికొంత మందికి కేసీఆర్ టికెట్లు ఇవ్వాలని భావిస్తున్నారు.మౌనంగా ఉంటే బీజేపీ మింగేస్తోందనే భయంతో ఆందోళనలు చేస్తున్నారు. హిందువుల గురించి బీజేపీ మాట్లాడితే మతతత్వం అంటున్నారు, నిత్యం నిజాంను కేసీఆర్ పొగుడుతున్నారు.. ఇది మతతత్వం కాదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం కట్టి పాలమూరుకు ఎన్ని టీఎంసీల నీళ్లు కొత్తగా ఇచ్చారో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి ఈ అంశంపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలన్నారు. కేసీఆర్ ఆరోపణలపై బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధం అని రఘునందన్ రావు సవాల్ విసిరారు.