మాజీ మంత్రి ఈటల రాజేందర్.. బీజేపీలో చేరకముందే ఆ పార్టీలో కాకరేగింది.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ముందే ఈ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేయగా.. తాజాగా, మరోనేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు కూడా చర్చగా మారాయి.. ఇక, పార్టీలో చేరికకు ముందు.. ఢిల్లీలో మకాం వేసి.. తనకుఉన్న అనుమానాలను బీజేపీ అధిష్టానం ముందు పెట్టిన ఈటల.. ఈ సందర్భంగా హామీ కూడా తీసుకున్నట్టు ప్రచారం జరిగింది.. కానీ, ఈటల రాజేందర్‌కు ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. మరోవైపు.. బీజేపీలో అలకలు, బుజ్జగింపులు లేవన్న ఆమె.. పెద్దిరెడ్డి.. పార్టీలోనే ఉంటారని తెలిపారు.. పాత వారికి, కొత్త వారికి సమన్వయం ఉంది.. అంతా కలిసే పనిచేస్తున్నామని.. హుజూరాబాద్‌లో ఎవరు పోటీ చేయాలనేది.. పార్టీయే నిర్ణయిస్తుందన్నారు.
ఈటల రాజేందర్.. బీజేపీలో చేరడం వల్ల పార్టీకి లాభం అన్నారు డీకే అరుణ.. నేను పార్టీలో చేరినప్పుడు కూడా నాకు ఏమి హామీ ఇవ్వలేదన్న ఆమె.. ఈటలకూ ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు.. మరోవైపు.. చాలా మంది కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నానంటూ బాంబ్ పేల్చారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కి ప్రత్యామ్నాయం బీజేపీయేనని ధీమా వ్యక్తం చేసిన అరుణ.. రాబోయో రోజుల్లో పార్టీలో చేరికలు ఉంటాయని.. గెలుపే లక్ష్యంగా పార్టీ లో చేర్చుకుంటామని ప్రకటించారు. ఇక, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో.. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో అధికారంలో టీఆర్ఎస్ ఉంది అనే టీఆర్ఎస్‌కు ఓటు వేశారని చెప్పుకొచ్చారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.