BJP- Communist Party Alliance: ఒకప్పుడు బీజేపీకి కమ్యూనిస్టులు అంటే అస్సలు నచ్చేది కాదు.. ఎర్ర జెండాకు వ్యతిరేకంగా, కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఎప్పుడూ తిరస్కరించే పార్టీగా బీజేపీ పేరుగాంచింది. అయితే, ఇప్పుడు పరిస్థితులు మారుతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్ర రావు చేసిన తాజా వ్యాఖ్యలు ఈ మార్పుకు సంకేతం? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, రామచంద్ర రావు ఇటీవల ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలలో మాట్లాడుతూ.. కమ్యూనిస్టులను బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు.. నేను కమ్యూనిస్టులను అవమానపర్చడం లేదు.. కానీ, వారి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా క్షీణించింది.. ఖమ్మం, నల్గొండ జిల్లాలో కూడా వారి ప్రస్థానం దాదాపు ముగిసింది అన్నారు. వారిలో చాలా మంది నాతో మాట్లాడుతూనే ఉంటారని పేర్కొన్నారు.
Read Also: Mumbai Teacher: హ్యాండ్ రైటింగ్ బాగా లేదని విద్యార్థిపై దాడి.. టీచర్ అరెస్ట్!
ఇక, పశ్చిమ బెంగాల్‌లో ఒకప్పుడు కరడు కట్టిన కమ్యూనిస్టులు కూడా బీజేపీలో చేరి పార్టీ బలోపేతంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్ర రావు గుర్తుచేశారు. అలాగే, తెలంగాణలో కూడా కమ్యూనిస్టులు బీజేపీ వైపు చూడాలని పిలుపునిచ్చారు. ఇకపై కమ్యూనిస్టులు ఒకటి రెండు సీట్లు గెలవడం తప్ప పెద్ద ప్రభావం చూపలేరని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, కమ్యూనిస్టు నేపథ్యం ఉన్న వారిని కూడా బీజేపీ సానుకూలంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
Read Also: Kingdom : శ్రీలీల టాలీవుడ్ గ్లామర్ గ్యాప్‌లోకి.. భాగ్యశ్రీ !
అయితే, కమ్యూనిస్టుల పని తీరు, పోరాట పటిమ తనకు బాగా తెలుసు అని టీబీజేపీ చీఫ్ రామచంద్ర రావు అన్నారు. కాబట్టి వారి రాకతో బీజేపీకి మరింత బలం చేకూరుతుందని ఆయన విశ్వాసం చేశారు. ఇప్పటికే నక్సల్ అనుబంధ సంస్థలో పని చేసిన ఈటెల రాజేందర్ లాంటి నేతలు బీజేపీలో కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు మతవాద పార్టీగా పేరు పొందిన బీజేపీ, ఇప్పుడు కమ్యూనిస్టుల పట్ల కూడా సానుకూలంగా వ్యవహరిస్తోంది. కమ్యూనిస్టులను పార్టీకి ఆహ్వానించడం, రాజకీయ సమీకరణల్లో కొత్త మార్పుకు సంకేతమా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏది ఏమైనప్పటికీ, కమ్యూనిస్టుల పట్ల బీజేపీ వైఖరి మారినట్లు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు వ్యాఖ్యలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.