ఎన్నికల ప్రచారం సీఎల్పీ నేత, ఎమ్మెల్యే అభ్యర్థి భట్టి విక్రమార్క్ మరో ముందడుగు వేశారు. సోమవారం ఖమ్మంలో ప్రచారం చేపట్టిన భట్టి ఈ సందర్భంగా ప్రమాణం చేశారు. ఈ ప్రచారంలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చొప్పికట్లపాలెంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రమాణం చేశారు. అవినీతి రహితంగా వ్యవహరిస్తానని ఆంజనేయస్వామి ఎదుట ప్రమాణం చేశారు. అనంతర ఆయన మాట్లాడుతూ.. ‘రైతుబంధు ఆపింది కాంగ్రెసేనంటూ బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ‘రైతులను కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలే మోసం చేశారు. రైతు బంధు పథకం నిధులను నోటిఫికేషన్ రాక ముందే ఇచ్చేలా చూడాలని మేం ఈసీని కోరాం.
నోటిఫికేషన్ వస్తే రైతు బంధు అమలు చేయలేమని తెలిసి కూడా బీఆర్ఎస్ జాప్యం చేసింది. కాంగ్రెస్ పార్టీకి రైతులకు మధ్యనే పేగుబంధం ఉంది. రైతులకందించే సబ్సిడీ పథకాలను పూర్తిగా రద్దు చేసిన బీఆర్ఎస్ పార్టీకి రైతులతో బంధమా..? రైతులకు సబ్సిడీ పధకాలు అందించి కాంగ్రెస్.. వ్యవసాయం కోసం ఇరిగేషన్, పవర్ ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీనే. బీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా రైతులు బీఆర్ఎస్ మాటలు నమ్మరు. రైతులు కాంగ్రెస్ పక్షానే ఉన్నారు. మాకు ఓటేస్తేనే తెలంగాణకున్న రిస్క్ పోతుంది.. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే రిస్క్ ఉంటుంది. మతాలను రెచ్చగొట్టేలా అమిత్ షా మాట్లాడుతున్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు వారి ఆర్థిక వెనుకబాటు తనాన్ని చూసి ఇచ్చిందే తప్ప.. మత ప్రాతిపదికన కాదు’ అని ఆయన పేర్కొన్నారు.