సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో మాట్లాడారు. పలు అంశాలను కూలంకషంగా వివరించారు. కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత వుంది. చెప్పిన మాటకు కట్టుబడి వుంటాం. రాష్ట్ర విభజనపై అవగాహన లేనివారు ఏదో ఒకటి మాట్లాడుతారు. 2009 నుంచి 2014 వరకూ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ లేదు. కాబట్టి రాష్ట్ర విభజన చేయలేదు. వంక పెట్టారని వచ్చే ఆరోపణల్ని ఖండిస్తున్నా. బిల్లు పెట్టి పాస్ కాకుంటే మొదటికే మోసం వస్తుందని, అందరినీ ఒప్పించేందుకు కాంగ్రెస్ ఎన్నో ఇబ్బందులు పడింది. ఇబ్బంది పడి ఇచ్చినందుకే కాంగ్రెస్ కి ఈ దుస్థితి వచ్చిందా అంటే అలాంటిదేం లేదు. అవగాహన లేని వారు అలా మాట్లాడతారన్నారు.
తెలంగాణ ప్రాసెస్ విషయంలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించలేదన్నారు. అధికారం కోసం ఆలోచన చేయలేదన్నారు. మనం నష్టపోతామని తెలిసినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సోనియాగాంధీ భావించారు. సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ ఒప్పుకున్నారన్నారు భట్టి విక్రమార్క. పీసీసీలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఎప్పటినుంచో వుందన్నారు. పార్టీలో అంతర్గత విభేదాలు లేవన్నారు. అందరినీ చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు.
తెలంగాణలో సరైన సమయంలో సరైన నిర్ఱయాలు వుంటాయి. ఏ ఒక్కరి కోసం పార్టీ వుండదు. తెలంగాణలో అన్ని కమిటీలు ముందుకెళతాయి. ఒకరి మీద ఒకరి ఆధిపత్యం వుండదు. అనుబంధ సంఘాల ద్వారా పార్టీ పరంగా పనిచేస్తుంటాయన్నారు. అధిష్టానం నిర్ణయాల మేరకు నేను పనిచేస్తా. పార్టీ ఏం చెబితే అది చేస్తాం. ఖమ్మంలో కాంగ్రెస్ బలంగా వుందన్నారు భట్టి విక్రమార్క.
నేను రాష్ట్ర స్థాయి నేతను. మధిరకు పరిమితం కాలేదు. నేను ఎక్కడ పోటీచేసినా గెలవనన్నారు. 2018లో నేనసలు గెలవనన్నారు. కోట్లు వెదజల్లారు. కానీ, మధిర ప్రజలు నన్ను నమ్మారు. నన్ను ఎమ్మెల్యేని చేశారు. ఎవరేం చెప్పినా జనం నాపై నమ్మకం వుంచారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలి. నేను టీఆర్ఎస్ ఏజెంట్ అనేది కుట్ర. నన్ను బయటకు పంపితే పార్టీని మరింతగా బలహీనపరచవచ్చని కొందరు ప్రచారం చేశారు. దళితబంధు మీటింగ్ కు నేను సీఎంని పిలిస్తే వెళ్ళాను. అప్పటినుంచి నాపై దుష్ప్రచారం చేశారు. నేను పార్టీ పంపితేనే వెళ్ళా. పార్టీ పంపిన సంగతి కంటే నేను మీటింగ్ కి వెళ్ళాననేది హైలైట్ చేశారు.
సాయి గణేష్ ఆత్మహత్య విషయంలో మేం సరిగానే స్పందించాం. పార్టీ పరంగా బీజేపీ ప్రచారం చేసుకున్నారు. ఒక సామాన్య వ్యక్తి, పౌరుడు మరణించడంపై స్పందించాం. మంత్రి అజయ్ కి నాకేం లేదు. నాపై కుట్రదారులు చేసిన దుష్ప్రచారం అది. రాష్ట్రంలో కేసీఆర్ ని టార్గెట్ చేస్తా. మూలస్థంభాన్ని ఢీకొట్టిన నాయకుడిని నేను. భట్టిని బలహీనపరచడం ఎవరి వల్ల కాదు. దళిత బంధు పైలెట్ ప్రాజెక్టు ఎందుకిచ్చారు? నా అడుగడుగునా నేను పార్టీ కోసం పనిచేస్తున్నాను. పార్టీ నష్టపోవాలని చేసే ప్రచారం అది. రేవంత్ ని మేం వేరుగా చూడడం లేదు. నా అసమర్థత వల్ల నాకు పీసీసీ రాలేదని భావించడం లేదు. పార్టీ అధిష్టానం నిర్ణయం శిరోధార్యం.
తెలంగాణ రాజకీయాల్లో రాహుల్ గాంధీ పాల్గొన్న వరంగల్ డిక్లరేషన్ నాంది పలుకుతుందన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళుతుందన్నారు భట్టి విక్రమార్క.