దేశవ్యాప్తంగా బీసీల మీద కుట్ర జరుగుతోందని.. అంతా అప్రమత్తంగా వుండి ఎదుర్కోవాలన్నారు ఆర్ కృష్ణయ్య. హుజూరాబాద్ లోనే కాదు… దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ దోపిడీని ఎత్తిచూపిస్తామన్నారు. అన్ని రాష్ట్రాల్లో దండోరా వేస్తాం అన్నారు ఆర్ కృష్ణయ్య. పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీల మీద కనిపించని కుట్ర జరుగుతోందని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారన్నారు. పేద వర్గాలను లేబర్ గా ఉంచాలన్నదే కేంద్రం కుట్రగా కనిపిస్తోందన్నారు.
లక్షల కోట్ల ఆదాయం తెచ్చిపెడుతున్న రైల్వేలని ప్రైవేటుపరం చేయాల్సిన అవసరం ఏముందన్నారు. పేదవారికి రక్షణ కల్పించే.. ఎల్ ఐ సీ ని కుట్రపూరితంగా ప్రైవేటీకరిస్తున్నారని మండిపడ్డారు. దేశ భద్రత గురించి మాట్లాడే… మీరు డిఫెన్స్ రంగాలను ఎవరి చేతుల్లో పెడుతున్నారన్నారు. బీసీ సంక్షేమ సంఘానికి ఏ పార్టీ అవసరం లేదు… మా జోలికి వస్తే మాత్రం తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. అంబానీ, ఆదానీ, టాటా, బిర్లా లను మీరే పెంచి పోషిద్దాం అనుకుంటున్నారు. అది జరగని పని. సరికొత్త విప్లవం తీసుకొస్తామని హెచ్చరించారు.