మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజక వర్గంలో బండి సంజయ్ నాలుగోవిడత పాదయాత్ర ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 12వ తేదీ నుండి ప్రారంభించనున్న నాలుగోవిడత పాదయాత్ర మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి అడ్డాలో నిర్వహించాలనే యోచనలో బీజేపీ తెలంగాణ శాఖ ఉంది. మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో నాలుగోవిడత పాదయాత్ర నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశ్యం .. హైదరాబాద్ నగరంలోనే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు అందుబాటులో ఉంటూ ప్రతిష్టాత్మకమైన మునుగోడు ఉప ఎన్నకను కూడా పర్యవేక్షించడానికే అంటున్నారు.
నాలుగో విడత పాదయాత్ర రూట్ మ్యాప్, ఎక్కడ ప్రారంభించాలి? ఎక్కడ ముగించాలి అనే అంశాలపై సెప్టెంబర్ 2,3 తేదీల్లో జిహెచ్ఎంసి, ఉమ్మడి రంగారెడ్డి పరిధిలోని నాయకులు, కార్యకర్తలతో ఒకసమావేశాన్ని నిర్వహించి తుదినిర్ణయం తీసుకోనున్నారు. నాలుగో విడత పాదయాత్రను కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గాజులరామారం లో వున్న చిత్తారమ్మ అమ్మవారి ఆలయం లేదా సూరారంలోని కట్టమైసమ్మ అమ్మవారి గుడి వద్ద ప్రారంభిస్తే బాగుంటుందని ఇప్పటికే నాయకులు సూచించారు.
Read Also: అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ సార్లు డకౌట్ అయిన టీమిండియా ఓపెనర్లు
నాలుగోవిడత పాదయాత్ర కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రారంభించి వ్యూహాత్మకంగా అబ్దుల్లాపూర్ మెట్ ఓఆర్ ఆర్ వద్ద ముగించాలనే యోచనలో ఉన్నారు. దీనికి కారణం దీని ప్రభావం మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పాదయాత్ర ముగించే ప్రాంతానికి 10- 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నాలుగోవిడత పాదయాత్ర పూర్తిగా పట్టణ ప్రాంతంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతుంది. కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, మేడ్చల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, ఉప్పల్, ఎల్‌బి నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది. ప్రతి నియోజకవర్గంలో రోజున్నర పాటు యాత్ర కొనసాగించాలని, ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పెద్ద సభను సాయంత్రం నిర్వహించాలని తలపెట్టారు.
ప్రతీ రోజు 12 నుండి 16 కిలోమీటర్లు యాత్ర కొనసాగించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో నాలుగో విడత పాదయాత్ర నిర్వహించడంలో దాగివున్న వ్యూహం జిహెచ్ఎంసి పరిధిలో బిజెపి పార్టీ పటిష్టవంతంగా వుండటంతో పాటు టిపిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో పాగా వేయాలని, కాంగ్రెస్‌పార్టీని పూర్తిగా లేకుండా చేయాలని ఉద్దేశంగా కనిపిస్తోంది. నాలుగోవిడత పాదయాత్రలో గోరేటి వెంకన్న “పాట గల్లీ చిన్నది … గరీబోళ్ల కథ పెద్దది … “పాటని విస్తృతంగా వాడుకోవాలని కూడా యోచనలో బిజెపి తెలంగాణ శాఖ ఉన్నట్టు తెలుస్తోంది.