హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హజురాబాద్ ఉపఎన్నిక ఓటింగ్ లో పాల్గొన్న ఓటర్లకు ధన్యవాదాలు.
పార్టీ శ్రేణుల నుండి అందిన సమాచారం ప్రకారం బీజేపీ భారీ మెజారిటీతో గెలవబోతోంది. బీజేపీ గెలుపు కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు. వారందరికీ నా ధన్యవాదాలు. పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సహకరించిన పార్టీ కార్యకర్తలు, అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.
అంతేకాకుండా హుజురాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అప్రజాస్వామికంగా వ్యవహరించి, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిందన్నారు. ఓట్లను అడ్డగోలుగా కొనుగోలు చేసేందుకు ప్రయత్నించడమే కాకుండా అసత్యపు ప్రచారాలు, అబద్ధపు మాటలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ఎంత ప్రయత్నించినా హుజురాబాద్ ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించి న్యాయం వైపు, ఈటల రాజేందర్ వైపు, బీజేపీ వైపే నిలిచారన్నారు.
టీఆర్ఎస్ ఎంత డబ్బు ఖర్చుపెట్టినా, ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు నిష్పక్షపాతంగా న్యాయం, ధర్మం వైపు నిలిచారన్నారు. టీఆర్ఎస్ పార్టీ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా.. అధికార యంత్రాంగంతో బీజేపీ పై ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా, మా కార్యకర్తలను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా.. ఎక్కడా అదరక, బెదరక పూర్తి సమయమిచ్చి బీజేపీ విజయం కోసం కృషి చేశారని ప్రశంసించారు.
కేసీఆర్ అహంకారానికి, హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి జరిగిన పోటీలో ప్రజలు ఒక మంచి ఆలోచనతో బీజేపీ పార్టీని ఆదరించారన్నారు. బీజేపీ శ్రేణులు రాత్రిపగలు పార్టీ విజయం కోసం పాటుపడ్డారని. ప్రజలకు అవగాహన కల్పించారని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో బీజేపీ శ్రేణులు మరింత కష్టపడి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని కోరారు.