సరూర్ నగర్ పరువు హత్యపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం అమ్మాయిని పెళ్ళి చేసుకున్నందుకే ఈ హత్య జరిగిందని ఆరోపించిన ఆయన.. ఈ హత్య చేసిన వ్యక్తుల్ని, అలాగే వారి వెనకున్న శక్తుల్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇది పూర్తిగా మతపరంగా జరిగిన హత్యగానే బీజేపీ భావిస్తోందన్నారు. ఈ కిరాతకమైన ఘటనపై సెక్యులర్ పార్టీలు, సెక్యులర్ మేధావులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
లవ్ జిహాద్ పేరుతో మతోన్మాద సంస్థలు మత మార్పిళ్లకు పాల్పడుతున్నారని బీజేపీ విమర్శిస్తే.. ఈ సెక్యులర్ వాదులు మాత్రం బీజేపీని మత ఉన్మాదులుగా పేర్కొంటున్నారంటూ మండిపడ్డారు. మరి ఈ సంఘటన ఏ కోవకు చెందుతుందో ఆ మేధావులు ప్రజలకి వివరించాలని నిలదీశారు. గతంలో మిర్యాలగూడ లాంటి సంఘటనలు జరిగినప్పుడు గొంతెత్తి అరిచిన అభ్యుదయ వాదులు.. ఇప్పుడెందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయని, కానీ ఒకట్రెండు మాత్రమే వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు.
హిందూ యువకులు ఏ ముస్లిం యువతిని పెళ్ళి చేసుకోకుండా భయబ్రాంతులకు గురి చేయడం కోసం ఇంత కిరాతకంగా ఈ హత్యకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు. హిందూ యువతిని ముస్లిం యువకుడు పెళ్ళి చేసుకొని, మత మార్పిళ్ళకి పాల్పడినప్పుడు ఏ ఒక్కరూ ముందుకు రారన్నారు. ఇప్పటికైనా హిందూ సమాజం మేలుకొని, ఇలాంటి సంఘటనల్ని ఖండించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఇలాంటి సంఘటనల్ని ప్రోత్సాహిస్తోన్న మతోన్మాద శక్తులను, సంస్థల్ని.. అలాగే వాటికి సహకరిస్తున్న సోకాల్డ్ సెక్యులర్ పార్టీలను సమాజం నుండి తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.