జూబ్లీహిల్స్ అత్యాచార సంఘటన జరిగినప్పటి నుంచి ప్రభుత్వం నిందితులను కాపాడే ప్రయత్నం చేసిందని.. చట్టాన్ని కాపాడే వారే ఈ కేసును నీరుగార్చడానికి అనేక కుట్రలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ స్పందించి ఆందోళన చేస్తే ఈ మాత్రం చర్యలైనా తీసుకున్నారని ఆయన అన్నారు. మొదటి నుంచి ఈ కేసులో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేతగాని తనంలో ఉన్నారని విమర్శించారు. ఫార్మ్ హౌజ్ కే పరిమితం అయ్యారని ఆరోపించారు.
రాష్ట్రంలో 15 రోజుల నుంచి రోజుకో సంఘటన జరుగుతుందని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో ఏ ఘటన జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వస్తుందని.. మీడియా, సోషల్ మీడియా ద్వారానే నిజాలు బయటకు వస్తున్నాయని.. ప్రభుత్వం, పోలీసులు స్పందించే పరిస్థితి లేదని ఆరోపించారు. తెలంగాణలో పోలీస్ వ్యవస్థ ఉందా.? అని సీఎం అసలు ఉన్నాడా.? లేడా.? అని ప్రశ్నించారు. మే 28వ తేదీన సంఘటన జరిగితే 31 వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని..బీజేపీ ఆందోళన చేసిన తర్వాతే ఇద్దరిని ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారని అన్నారు.
డీసీపీ ప్రెస్ మీట్ పెట్టి శాసనసభ్యుడికి కొడుకుకు సంబంధం లేదని అన్నాడని.. ఈ రోజు శాసన సభ్యుడిని రిమాండ్ చేశారని అన్నారు. గవర్నమెంట్ వాహనం ఉందని సీసీ ఫుటేజ్ చూస్తే తెలిసిందని.. ఇన్ని రోజులుగా వాహానాన్ని ఎందుకు సీజ్ చేయలేదని ప్రశ్నించారు. పూర్తిగా కార్ ను సర్వీసింగ్ చేయించి ఆధారాలు పోయేలా చేశారని విమర్శించారు. ఉన్నత స్థాయి వ్యక్తులను , రాజకీయ కుటుంబాలను కాపాడేందుకు పోలీసులు విజయం అయ్యారని.. ఆధారాలు దొరకనివ్వలేదని.. నిజమైన నిందితులను చివరగా చేర్చారని విమర్శించారు.
చట్ట ప్రకారం న్యాయపరంగా వ్యవహరించాల్సిన పోలీసులు భిన్నంగా వ్యవహరించారని ఆరోపించారు. రాష్ట్ర సీఎంఓ ఆదేశాల ప్రకారం కేసును నీరుగార్చారని విమర్శించారు. ఎంఐఎం అత్యాచారాలు చేస్తుందని.. టీఆర్ఎస్ హత్యలు చేస్తుందని, ఆత్మహత్యలను ప్రోత్సహిస్తుందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం ఆదేశిస్తే తప్ప పోలీసులు స్పందించే పరిస్థితి లేదని ఆయన విమర్శించారు.