తెలంగాణ సీఎం కేసీఆర్ జోకర్‌లా వ్యవహరిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ చేసిన అనర్ధాలను ప్రధాని మోదీ వివరించే ప్రయత్నం చేస్తే… టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఇబ్బందేంటని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే టీఆర్ఎస్ ఎందుకు స్పందిస్తోందని నిలదీశారు. రాజ్యాంగంపై విమర్శలను డైవర్ట్ చేసేందుకే టీఆర్‌ఎస్ నిరసనలు చేపడుతోందని విమర్శించారు. రాజ్యాంగం విషయంలో కేసీఆర్ చేసిన వాఖ్యలపై బీజేపీ ఆందోళనలు చేస్తోందని.. అసలు రాజ్యాంగం వల్ల వచ్చిన ఇబ్బందులేంటో కేసీఆర్ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ దిగి వచ్చేవరకు గుణపాఠం చెప్తామన్నారు.
Read Also: ప్రధాని మోదీ తప్పు చేశారు: టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు
బీజేపీ హయాంలో మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఎక్కడా పెప్పర్ స్ప్రే కొట్టలేదని.. కానీ ఏపీ విభజన బిల్లు సమయంలో పార్లమెంట్‌లో కాంగ్రెస్ నాయకులు పెప్పర్ స్ప్రే కొట్టినా సుష్మాజీ భయపడలేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ దొంగ దీక్షలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారులను కేసీఆర్ పక్కన పెట్టారన్నారు. పక్క రాష్ట్రం ప్రాజెక్టులు కడుతున్నా పట్టించుకోకుండా ఫాం హౌస్ లో పడుకుంటున్న సీంఎ కేసీఆర్ కు అసలు తెలంగాణపై ఆసక్తి లేదని, కేసీఆర్ కేబినెట్ లో ఎంతమంది తెలంగాణ ఉద్యమకారులున్నారని సంజయ్ ప్రశ్నించారు. కృష్ణా జిల్లాలో 279 టీఎంసీల కోసం సంతకం కేసీఆర్ ఎందుకు సంతకం పెట్టాడని బండి సంజయ్ నిలదీశారు. కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా, బాబా సాహెబ్ రచించిన రాజ్యాంగం కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. ప్రధాని మోదీని టీఆర్ఎస్ ఏ స్థాయిలో తిడితే అదే స్థాయిలో తాము అడ్డుకుంటామని హెచ్చరించారు. మోదీ విభజనను తప్పు పట్టడం లేదని.. కేవలం విభజన జరిగిన తీరునే ఆయన ప్రశ్నించారన్నారు.