తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే నిన్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు నల్ల కండువాలు ధరించి ఆందోళన చేపట్టారు. దీంతో స్పీకర్ బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంలో బీజేపీ ఎమ్మెల్యేలు ముందే అనుకొని నల్ల కండువాలతో అరిచారని, స్పీకర్ వెల్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. ఆ సందర్భంలో బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారని, ఇటీవలే హిమాచల్ ప్రదేశ్‌లో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని, కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేను వారం పాటు సస్పెండ్ చేశారన్నారు.
దేశంలో గతంలో చట్ట సభల నుంచి సభ్యులను సస్పెండ్ చేసిన సందర్బాలు చాలా ఉన్నాయని ఆయన అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ప్రణాళికబద్దంగా వచ్చారని, బీజేపీ ఎమ్మెల్యేలు చిల్లర ప్రయత్నం చేశారని ఆయన విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెండ్ చేయడంలో కొత్త లేదు… వింత లేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు పద్ధతి మార్చుకోవాలని, తెలంగాణకు విభజన చట్టం ప్రకారం రావాల్సిన వాటి కోసం బీజేపీ ఎమ్మెల్యేలు మోడీ ముందు, హోం మంత్రి కార్యాలయం ముందు నల్ల కండువా వేసుకొని ధర్నా చేయండని ఆయన సవాల్ విసిరారు.