హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చెదురు ముదురు ఘటనలు తప్ప పెద్దగా ఏమీ జరగలేదు. దీంతో ఎన్నికల కమిషన్ ఊపిరి పీల్చుకుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రత్యేకమైనది కావడంతో నాయకుల్లో గుబులు పట్టుకుంది. పెరిగిన పోలింగ్ శాతం ఎవ్వరికి లాభిస్తుందోనని నాయకులు ఆందోళనలో ఉన్నారు. హోరాహోరిగా సాగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో సాయంత్రం 7గంటల వరకు 86.40 శాతం పోలింగ్ నమోదు అయింది. గతంలో కన్నా ఈసారి ఎక్కువగా పోలింగ్ జరగడంతో ఎవ్వరికి ఎక్కువ మెజార్టీ వస్తుందో .. ఎవ్వరూ గెలుస్తారో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు ఎవ్వరికి వారే గెలుపుపై ధీమాగా ఉన్నాయి. దీంతో తాజాగా పీపుల్స్ పల్స్ మూడ్ సర్వే ప్రకారం ఈటల రాజేందర్‌కే ఎక్కువ అవకాశం ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
పీపుల్స్ పల్స్ మూడ్ సర్వే గణాంకాలు..
హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీకి స్పష్టమైన మొగ్గు ఉండే అవకాశం ఉందని చెబుతున్నాయి. బీజేపీ-టీఆర్ఎస్ మధ్య 7-9 శాతం ఓట్ల వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. మార్జిన్ అఫ్ ఎర్రర్ + (ప్లస్) ఆర్ – (మైనస్) 3 శాతంగా ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోతుందని చెప్పాయి. బీజేపీఅభ్యర్థి ఈటెల రాజేందర్‌కు సానుభూతి, నియోజకవర్గ ప్రజలతో ఉన్న సత్సంబంధాలతోపాటు సానుకూలత పవనాలు కలిసోచ్చే అంశం ఆయనకు ప్లస్ కానుంది. ఈటెల రాజేందర్ వ్యక్తిగత ఇమేజ్ కూడా బాగా కలిసోస్తుంది. సైలెంట్ ఓటింగ్ పనిచేస్తే ఈటలకు మెజార్టీ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అన్ని సామాజిక వర్గాలు… ముఖ్యంగా యువత మద్దతు బీజేపీ వైపే ఉందని,మరో వైపు టీఆర్ఎస్ డబ్బు పంపిణీ బెడిసికొట్టందని ఈ సర్వే సమాచారం చెబుతుంది.