భయం చాలా ప్రమాదకరమైనది. పూర్తి అవగాహన లేకుండా కొన్ని సార్లు భయపడితే ప్రాణాల మీదకే రావచ్చు.. ఏకంగా ప్రాణాలే కోల్పోవచ్చనేదానికి ఈ ఘటనే నిదర్శనం.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన పొనగంటి వేణు అనే యువకుడు సంఘమిత్ర కళాశాలలో కంప్యూటర్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఆదివారం కావడంతో నిన్న రాత్రి హుజురాబాద్ రోడ్‌లో గల అభిరామ్ బార్ ఎదురుగా ఉన్న రోడ్డు లోపల స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో అటుగా వచ్చిన పోలీస్ సైరన్ విని భయంతో మద్యం సేవిస్తున్న యువకులు ఒక్కసారిగా పరుగులు తీయటం మొదలుపెట్టారు. పరిగెత్తుతున్న సమయంలో సమీపంలోని బావిలో వేణు పడిపోయాడు. అది గమనించిన స్థానికులు బావిలో దూకి కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. వేణు మరణవార్త విన్న కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి భార్య ఇద్దరు చిన్న కుమార్తెలు ఉన్నారు.